టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నాడు. తన భార్య హేజెల్ కీచ్ పండండి ఆడ పిల్లకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. భార్య, కుమారుడు, పాపతో ఉన్న ఫొటోను శుక్రవారం యువీ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. శ్రావణ శుక్రవారం వేళ యువీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అభిమానులు యువరాజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
‘ఎన్నో నిద్రలేని రాత్రులు ఇప్పుడు ఆనంద ఘడియలుగా మారాయి. యువరాణి ఆరాకు ఘన స్వాగతం. ఆమె రాకతో మా కుటుంబం పరిపూర్ణమైంది’అని యువరాజ్ సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఫొటోకు క్యాప్షన్ జోడించాడు. యువీ తండ్రవ్వడం ఇది రెండోసారి. 2016లో యువరాజ్ సింగ్, హేజిల్ కీచ్‌కు వివాహం అయింది. గతేడాది కుమారుడు ఒరియాన్ పుట్టాడు. ఇప్పుడు కూతురు పుట్టింది. దాంతో యువరాజ్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
2019లో యువరాజ్ సింగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2019లో చోటు దక్కని కారణంగా జట్టుని ప్రకటించిన కొన్ని రోజుల్లోనే యువీ రిటైర్‌మెంట్ ఇచ్చాడు. యువీ భారత్ తరఫున 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేయగా.. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. ఇందులో 8 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ సాధించిన రెండు ప్రపంచకప్‌లలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి చరిత్ర సృష్టించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ షోతో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్నాడు. ఆపై క్యాన్సర్ బారిన పడి.. అమెరికా వెళ్లి చికిత్స చేసుకున్నాడు. క్యాన్సర్‌నుంచి కోలుకున్నాక యువీ కెరీర్ అంతగా సాగలేదు. యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురు కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. 2017లో చివరి వన్డే, టీ20 ఆడాడు. 2019లో వీడ్కోలు పలికాడు.