టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కొత్తపల్లిలో ఏర్పాటుచేసిన పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీమంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎన్.అమర్ నాథ్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పీతల సుజాత, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కావలి ఇన్ ఛార్జి సుబ్బానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, మీనాక్షినాయుడు తదితరులు లోకేశ్ ను కలిసి అభినందనలు తెలిపారు. యువగళం పాదయాత్ర 2వేల కి.మీ. మైలురాయి చేరుకున్న సందర్భంగా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నాయకుడు గోనుగోంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యాన లోకేశ్ దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు. దివ్యాంగులకు ఉపయోగపడే ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, హియరింగ్ మిషన్లు అందజేశారు. పులివెందులకు చెందిన వీరారెడ్డికి ఈ సందర్భంగా లక్షరూపాయల ఆర్థిక సాయం చేశారు.
ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ.. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత తొలి అడుగుతో ప్రారంభమైన యువగళం జనగళమై, మహా ప్రభంజనమై, అరాచక పాలకుల గుండెల్లో సింహస్వప్నమై ప్రజలను చైతన్యపరుస్తూ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగుతున్న నా పాదయాత్ర ఈరోజు కావలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద చారిత్రాత్మక 2వేల కి.మీ. మజిలీకి చేరుకోవడం జీవితంలో మరపురాని ఘట్టం. ఇందుకు గుర్తుగా కొత్తపల్లిలో ఆక్వారైతులకు చేయూతనిచ్చే ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. కావలి ప్రజలు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరవలేను. అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ పథకాలను టీడీపీనే అమలు చేసింది.
జగన్ పాలనలో ప్రజలు భయంతో జీవిస్తున్నారు. భయం పోవాలనే ఉద్దేశంతోనే యువగళం పాదయాత్ర మొదలు పెట్టాను. యువగళం మీ గళాన్ని వినిపించడానికి ఒక వేదిక. టీడీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు లేని యువతకు ప్రతి నెలా ₹3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పెండింగ్ పోస్టులు అన్నీ భర్తీ చేస్తాం. సక్సెస్‌కి షార్ట్ కట్ లేదు యువత కష్టపడితేనే జీవితంలో విజయం సాధిస్తారు. టీడీపీ రాగానే.. సీఎం జగన్‌మోహన్ రెడ్డి పెంచిన పన్నులన్నీ తగ్గిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. నెల్లూరు జిల్లా కొత్తపల్లి గ్రామస్థులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ‘జగనోరా’ వైరస్‌కు చంద్రబాబే వ్యాక్సిన్ అని చెప్పారు. జగన్ పాలనలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు.
జగన్ పాలనలో రైతులు అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జగన్ విద్యా వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నాడు. స్కూల్స్ మూసేస్తున్నాడు. టీచర్ల పోస్టులు భర్తీ చెయ్యడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ నుంచి పీజీ వరకు విద్యను ప్రక్షాళన చేస్తాం. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా విద్యార్థులను సిద్ధం చేస్తాం’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.