తెలంగాణలో అభ్యర్థులు ఎంతగానో ఆశలుపెట్టుకున్న గ్రూప్-1 ప్రిలిమ్స్(Group-1 Prelims) పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. ఉద్యమంలో గ్రూప్-1 పరీక్షలు రాయకండి.. మన పరీక్షలు మనమే రాసుకుందామని రెచ్చగొట్టిన కేసీఆర్.. స్వరాష్ట్రంలో పెద్ద కొలువులు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. ఊరించి ఊరించి 9 ఏళ్లకు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ (Notification) గట్టు దాటక పాయె అని సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విటర్) వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. 503 పోస్టులకు రెండుసార్లు పరీక్షలు జరిగి రద్దయిన ఘటన ఇదేనని వైఎస్ షర్మిల అన్నారు బహుశా దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అసమర్థ విధానాలకు ఒక నిదర్శమని మండిపడ్డారు. పాలన చేతకాదనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిసిందల్లా పేపర్లు లీకులు చేయడమేనని ఆరోపించారు. సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మడమేనని దుయ్యబట్టారు. ఇది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
‘ఉద్యమంలో గ్రూప్-1 రాయకుండ్రి, మనయ్ మనమే రాసుకుందమని రెచ్చగొట్టిన దొర.. ఎక్కడ పాయె స్వరాష్ట్రంలో పెద్ద కొలువులు? ఊరించి ఊరించి 9 ఏండ్లకు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ గట్టు దాటక పాయె. ఒక్కరికీ ఉద్యోగం దక్కకపాయె. 503 పోస్టులకు రెండు సార్లు పరీక్షలు జరిగి రద్దైన ఘటన.. బహుశా దేశంలోనే మీ అసమర్థ విధానాలకు ఒక దర్పణం. పాలన చేతకాదనడానికి నిదర్శనం. పోటీ పరీక్షలు పెట్టరాదని బయటపడ్డ వాస్తవం. మీకు తెలిసిందల్లా పేపర్లు లీకులు చేయడమే. సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మడమే. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటమే. TSPSC కి విశ్వసనీయత లేదని చెప్పినా.. దర్యాప్తు జరుగుతున్నప్పుడు పాత బోర్డుతో పరీక్షలు వద్దని మొత్తుకున్నా.. బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు ఎత్తివేశారని నెత్తి నోరు బాదుకున్నా.. పట్టింపు లేకుండా పరీక్షలు పెట్టిన మీకు ఇవ్వాళ హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు. ఆనాడే లీకుల సూత్రధారులను పక్కన పెట్టుంటే.. నిరుద్యోగుల డిమాండ్లను గౌరవించుంటే.. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ చేసుంటే.. ఇవ్వాళ మరోసారి 2.37 లక్షల మంది గ్రూప్ 1 అభ్యర్థులకు నష్టం జరిగేది కాదు.నియంత కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలి.నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి.’ – Y.S.షర్మిల