వైఎస్ రాజశేఖరరెడ్డి (YS RAJASEKHAR REDDY).. వైఎస్సార్.. ఈ పేరు రాష్ట్ర ప్రజలకు ఓ భరోసా. అన్నదాతలకు అండ. సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్తస్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ (AAROGYASRI) పథకంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని (CORPORATE TREATMENT) అందించిన ప్రాణ దాత. పంట ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత. తెలుగు ప్రజల గుండె చప్పుడు.. అపర భగీరథుడు, మహానేత డాక్టర్ వై. యస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు. సంక్షేమానికి కొత్త భాష్యం చెబుతూ.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ రామరాజ్యాన్ని తలపించింది ఆయన పాలన. ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందించిన గొప్ప నేత. ఆయన మరణించి 14 ఏళ్లు కావొస్తున్నా.. తెలుగు ప్రజల స్మృతిపథంలో మాత్రం ఇంకా నిలిచేవున్నారు. అచ్చ తెలుగు పంచెకట్టు, చెరగని చిరునవ్వు, ప్రతి ఒక్కరిని పేరు పేరునా ‘‘నమస్తే నమస్తే ’’ అంటూ పలకరించే ఆ పిలుపు ఇంకా ప్రతి ధ్వనిస్తూనే వుంది.
వై. యస్. రాజశేఖర్ రెడ్డి..జయమ్మ(JAYAMMA), రాజారెడ్డి(RAJAREDDY) దంపతులకు 1949 జూలై 8 న వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు. రాజశేఖర్ రెడ్డి పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ లో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరాడు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల (యెస్.వి.ఆర్.ఆర్), తిరుపతి నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి.. రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల మన్ననలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. 1978లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందే వరకు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు.
కడప లోక్‌సభ(KADAPA LOKSABHA) నియోజకవర్గం నుంచి 4 సార్లు రాజశేఖర్ రెడ్డి ఎన్నికయ్యాడు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించాడు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేత గా, రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశాడు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి(RURAL DEVELPMENT), వైద్యశాఖ(HEALTH), విద్యాశాఖ(EDUCATION) మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించాడు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపాడు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమిల్లి జనార్ధన్‌రెడ్డిని పదవినుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాదు నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు.
2004-09 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా(CHIEF MINISTER) పని చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారు. 2003లో మండువేసవిలో దాదాపు 1467 కి.మీ. దూరం పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్(CONGRESS) పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన అనేక రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, 18 అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో 2009లో మరోసారి ఆయన సీఎంగా ఎన్నికయ్యారు. వైఎస్ సీఎంగా ఎన్నికైన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమం కోసం బయల్దేరిన ఆయన ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం రాష్ట్ర ప్రజలను కలచివేసింది.