టీడీపీ అగ్రనేత లోకేష్ పాదయాత్ర అల్లర్లకు దారి తీసింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో లోకేశ్ పాదయాత్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. అడుగడుగునా వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు.. టీడీపీ శ్రేణులపై దాడి చేసినా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా దాడులపై ఫిర్యాదు చేసిన తమపైనే కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 194వ రోజు యువగళం పాదయాత్ర జన నీరాజనాల మధ్య ప్రారంభమయ్యింది.
మీర్జాపురం నుంచి గొల్లపల్లి, మొరసపూడి, తుక్కులూరు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. పలువురు వైఎస్సార్సీపీ శ్రేణులు తమ పార్టీ జెండాలు పట్టుకొచ్చారు. వారిని పోలీసులు నియంత్రించలేదు. వైసీపీ శ్రేణుల్ని ప్రతిఘటించేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులపై పోలీసు జులుం ప్రదర్శించారు. పోలీసులు టీడీపీ శ్రేణులపైనే లాఠీలు ఝళిపించారు. పోలీసులు వైసీపీ శ్రేణులకు సద్దిచెప్పి జాగ్రత్తగా అక్కడి నుంచి పంపారు.
తుక్కులూరు వద్ద ఘర్షణకు అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు ముందస్తుగానే డీఎస్పీకి సమాచారం ఇచ్చినా, డీఎస్పీ అక్కడ ఉండి వైసీపీ కవ్వింపు చర్యలను పర్యవేక్షించారనిస, అక్కడ నుంచి వారిని పంపే ప్రయత్నం ఎంత మాత్రం చెయ్యలేదు టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ శ్రేణులపైకి రాళ్లు, జెండా కర్రలు విసిరి దాడులకు తెగబడుతున్నా చోద్యం చూసిన పోలీసులు ప్రతిఘటించేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులపై మాత్రం తమ ప్రతాపం చూపించారని అంటున్నారు. సంఘటనా స్థలంలోనే ఉన్న డీఎస్పీ తెలుగుదేశం శ్రేణులపైకి తన సిబ్బందిని ఉసిగొల్పుతున్న తీరు విమర్శలకు తావిచ్చింది.