ఏపీ శాసన సభలో చంద్రబాబుకు కేటాయించిన కుర్చీపైకి ఎక్కి బాలకృష్ణ విజిల్స్ వేయడం సిగ్గుచేటని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. సభ పట్ల టీడీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని, అసెంబ్లీలో ఈలలు వేసి సభ సాంప్రదాయాలను బాలకృష్ణ పాడు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు స్కిల్ కేసులో ఎలా అక్రమాలకు పాల్పడ్డారో సీఐడీ అధికారులుకోర్టుకు వివరించారని తెలిపారు. ఢిల్లీ నుండి పెద్ద న్యాయవాదులు వచ్చినా కోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. పీఎస్ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ఎలా డబ్బు దండుకున్నదీ సీఐడీ గుర్తించిందని అన్నారు.
సభలో రచ్చ చేయటానికి టీడీపీ సభ్యులు వచ్చారని విమర్శించారు. గొడవలు చేసిన ఆరుగురిని సస్పెండ్ చేస్తే టీడీపీ సభ్యులంతా బయటకు వెళ్లిపోయారని మంత్రి తెలిపారు. మిగతా వారు సభలో కూర్చుని సమస్యలపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. వారెవరికీ ప్రజా సమస్యలు పట్టలేదని అర్ధం అవుతుందని, అసెంబ్లీలో మాట్లాడటానికి చేతగాక టీడీపీ సభ్యులు పారిపోయారని దుయ్యబట్టారు. నేరం చేసిన గజదొంగ చంద్రబాబు అని.. అందుకే కోర్టు కూడా క్వాష్ పిటిషన్‌ను తోసిపుచ్చిందని తెలిపారు. కోర్టు తీర్పుపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందన్నారు.
‘వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదు. సభాపతి, మండలి ఛైర్మన్ అంటే టీడీపీ నేతలకు మర్యాద లేదు. సభకు రానంటున్నారంటే నేరం అంగీకరించినట్లే. టీడీపీ నేతల దగ్గర విషయం లేదు కాబట్టే సభ నుంచి పారిపోయారు. ఈరోజు సభలో ప్రతిపక్షం తీరు సభా చరిత్రలో దుర్దినం. వ్యవస్థలను దుర్వినియోగం చేయడం, నాశనం చేయడం చంద్రబాబు, టీడీపీ నేతల నైజం. సస్పెండ్ కాకుండా మిగిలిన సభ్యులు సభలో ఉండి ఉంటే చంద్రబాబు అవినీతి వివరాలను తెలుసుకునేరు.’అని అన్నారు.
చంద్రబాబు యువతకు ద్రోహం చేశాడు. 5 రోజులు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి యువతను మోసం చేశాడు. చంద్రబాబు స్కిల్ స్కామ్ లో ప్రధాన ముద్ధాయి అని అప్పటి అధికారులే చెప్పారు. చంద్రబాబుకు హాని తలపెట్టాల్సిన అవసరం వైఎస్సార్‌సీపీకి లేదు. చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం లోకేష్‌కు, ఆయన కుటుంబానికే ఉందిఏ తప్పు చేసినా తెలివిగా తప్పించుకోగలననే చంద్రబాబు స్కిల్.. స్కిల్ స్కామ్‌లో పారలేదు’ అని మంత్రి చెల్లుబోయిన అన్నారు.