ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కేడీసీసీ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావును తెలుగుదేశం పార్టీ నియమించింది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో ‘యువగళం’ పాదయాత్ర అశేష జనవాహిని నడుమ కొనసాగుతోంది. నరాలోకేష్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీనిలో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నారా లోకేశ్ సమక్షంలో వైసీపీకు చెందిన సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు, సహకార బ్యాంక్ సభ్యులు, ఇతర నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గన్నవరం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వెంకట్రావును నియమించినట్లు లోకేశ్ తెలిపారు.
పార్టీ నియామకం అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మీడియా తో మాట్లాడారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటమి కోసం తామంతా కలసి కట్టుగా పనిచేస్తామని తెలిపారు. టీడీపీ కంచుకోటలో పసుపు జెండా ఎగురవేస్తామని చెప్పారు. ఆత్మాభిమానంతోనే తెదేపాలో చేరామన్నారు. వంశీ వైకాపాకు మద్దతు ప్రకటించినపుడు తెదేపా శ్రేణులు మాత్రం ఆయన వెంట వెళ్లలేదని చెప్పారు. తాము రౌడీయిజం చేయడానికి రాలేదని.. రాజకీయం కోసమే వచ్చామన్నారు. కొత్త, పాత కలయికల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్తానని వెంకట్రావు చెప్పారు. ఏ ఒక్కరికి సమస్య ఉన్నా నేరుగా తనకి చెప్పాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.