ఢిల్లీతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. వరద నీరు పోటెత్తడంతో ఆల్‌టైం రికార్డ్‌స్థాయికి చేరుకుంది. సివిల్ లైన్స్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పూర్తిగా నీటమునిగింది. కశ్మీరీ గేట్ – మంజు కా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం ఉదయం 7 గంటలకు నదిలో 208.46 మీటర్ల మేర వరద ప్రవాహం ఉంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన యమునా నది ప్రవహిస్తోంది.
యమునా నది ఈ స్థాయిలో ప్రవహించడం చరిత్రలో ఇదే తొలిసారి. 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. వీలైతే హర్యానాలోని హథినికుండ్ బ్యారేజీ నుండి పరిమిత వేగంతో నీటిని విడుదల చేయాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించామని కేజ్రీవాల్ అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని ఆయన కోరారు. పొంగిపొర్లుతున్న నదిని చూసేందుకు కొందరు వెళ్లడం కూడా చూస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. దయచేసి సెల్ఫీలు తీసుకోవడానికి అక్కడికి వెళ్లవద్దని వేడుకున్నారు. బోట్‌క్లబ్, మఠం మార్కెట్, నీలి ఛత్రీ మందిర్, యమునా బజార్, నీమ్ కరోలి గౌశాల, విశ్వకర్మ కాలనీ, మజ్ను కా తిలా, వజీరాబాద్ మధ్య ప్రాంతం నీట మునిగింది. ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) సహాయం కోరవచ్చని తెలియజేసిందని కేజ్రీవాల్ చెప్పారు. అవసరమైతే పాఠశాలలను రిలీఫ్ క్యాంపులుగా మార్చాలని జిల్లా మేజిస్ట్రేట్‌లకు కూడా సూచించామని చెప్పారు.
మరోవైపు ఢిల్లీలోని పాత రైల్వే వంతెనే వద్ద యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. యమునా ఉప్పొంగడంతో సమీప ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోని నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సివిల్ లైన్స్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పూర్తిగా నీటమునిగింది. కశ్మీరీ గేట్ – మంజు కా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది.
మరోవైపు భారీ వర్షాలకు తోడు వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సహాయక చర్యల నిమిత్తం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. యమునా నది నీటిమట్టం నిరంతరం పెరగడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం యమునా సమీపంలో లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వీలైనంత త్వరగా తమ ఇళ్లను ఖాళీ చేయాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.