భార్యతో గొడవల కారణంగా తన భార్య, భార్య కుటుంబాన్ని మట్టుబెట్టాలని పథకం పన్నాడో లండన్ నుంచి ఓ వ్యక్తి పథకం పన్నాడు. భార్యతో విభేదాల కారణంగా హైదరాబాద్‌లో ఉన్న ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై ఓ వ్యక్తి లండన్ నుంచి విష ప్రయోగం చేయించాడు. అయితే ఈ విషయం బయటకు రాకముందే అత్త ప్రాణాలు కోల్పోయింది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా అతను చేసిన మొత్తం కుట్ర బయటపడింది. ఈ సంచలన కేసు వివరాలను మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్ వెల్లడించారు.
ఆయన తెలిపిన ప్రకారం.. మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్‌లో నివాసముండే హన్మంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె డా.శిరీషకు 2018లో సాఫ్ట్వేర్ ఇంజినీరైన ఎం.అజిత్‌కుమార్‌తో వివాహమైంది. ఉద్యోగరీత్యా ఇరువురు లండన్‌లో స్థిరపడ్డారు. వారికి ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు నెలకొనడంతో ఆమె లండన్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. భార్యపై కోపం పెంచుకున్న అజిత్‌కుమార్… ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులందర్నీ అంతమొందించాలని అనుకున్నాడు.
తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చేందుకు లండన్‌లోనే తన వద్ద పనిచేసే వినోద్‌కుమార్‌ను ఒప్పించాడు. వీరిద్దరికీ మిత్రులైన హైదరాబాద్‌లో ఉండే భవానీశంకర్, అశోక్, గోపినాథ్‌తోపాటు అజిత్ స్నేహితుడు, శిరీష బంధువైన పూర్ణేందర్‌రావులతో కలిసి కుట్రపన్నాడు. ఈ క్రమంలో సోదరుడి వివాహానికి లండన్ నుంచి శిరీష, ఆమె కుమార్తె హైదరాబాద్ వెళ్లడాన్ని అవకాశంగా మలచుకున్నాడు. అత్తారింటిపై నిఘా ఉంచేలా వాచ్‌మన్ కుమారుడు రమేష్‌కు కొంత నగదు ముట్టజెప్పాడు.
జూన్ 25న తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు విషపు ఇంజక్షన్లతో శిరీష తల్లిదండ్రుల ఇంటికి వెళ్లగా… హత్యాయత్నం విఫలమైంది. తమ పథకాన్ని మార్చి… వారింట్లో గుర్తుతెలియని విషాన్ని కలిపిన మసాలా పొడులు, పసుపు, కారం వంటి వాటిని శాంపిల్ ప్యాకెట్లుగా డెలివరీబాయ్ రూపంలో అందజేశారు. వాటిని వినియోగించడంతో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే శిరీష తల్లి ఉమామహేశ్వరి జులై 5న మృతి చెందారు. అందుకు ఆమె అనారోగ్యమే కారణమని అంతా భావించారు. అయితే శిరీష, ఆమె తండ్రి, సోదరుడు, మరదలు, బంధువైన మరో మహిళ కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయి.. కోలుకోకపోవడంతో అనుమానమొచ్చి రక్త నమునాలను పరీక్షకు పంపారు. అందులో విష నమూనాలు ఉన్నట్లు తేలింది. దాంతో శిరీష గురువారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్‌రావు.. మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్సైలు వెంకటేష్, జగదీష్, కానిస్టేబుళ్లు విజయేందర్‌రెడ్డి, విఠల్‌లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. వాచ్‌మన్ కుమారుడు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా.. అదే అపార్ట్మెంట్లో శిరీష ఫ్లాట్‌పైనే ఉండే పూర్ణేందర్‌రావు పేరు వెల్లడించాడు. దాంతో మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. కుట్ర అమలుకు సహకరించిన ఆరుగురిని శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. లండన్‌లో ఉన్న ప్రధాన నిందితుడు అజిత్‌కుమార్‌ను సైతం అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.