తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం() మరింత తీవ్రంగా బలపడిందని పేర్కొంది. ఇక అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి వైపు వాలి వచ్చే రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh, Odisha)మీదుగా కదిలే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలతోపాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు(Thunders), మెరుపులతో కూడిన భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
శనివారం నుంచి బుధవారం వరకు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉదయం వరకు కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్ వివరించింది. కాగా, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వాగులు, చెరువుల్లో జలకళ సంతరించుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. పలు నీటి ప్రాజెక్టుల నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అవసరమైన సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యవసాయ పనులు వేగంగా సాగుతున్నాయి.