యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ ఫుల్ జోష్‍లో ఉన్నారు. తానే దర్శకత్వం వహించి హీరోగా నటించిన దాస్ కా దమ్కీ మూవీ ఈ ఏడాది విడుదలై.. మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చేస్తున్నారు విశ్వక్. కొత్త డైరెక్టర్ రవితేజతోనూ మరో సినిమాకు ఓకే చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీలోనూ విశ్వక్‍సేన్ అడుగుపెడుతున్నారు. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ‘ఫ్యామిలీ ధమాకా’ అనే గేమ్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షోకు సంబంధించిన పాటను ఆహా నేడు (ఆగస్టు 25) రిలీజ్ చేసింది.
‘ఫ్యామిలీ ధమాకా’ గేమ్ షో కోసం ఆహా రిలీజ్ చేసిన ఈ ధమాకా సాంగ్ అదిరిపోయింది. విశ్వక్‍సేన్ తన డ్యాన్స్, గెటప్స్, స్టైల్‍తో ఇరగదీశాడు. స్టైలిష్‍గా ఫుల్ గ్రేస్‍తో కనిపించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ గేమ్ షోగా ‘ఫ్యామిలీ ధమాకా’ ఉండనుంది. విశ్వక్‍సేన్ సినిమాలను కలిపి ఓ కంటెస్టెంట్ చెప్పిన డైలాగ్ ఈ సాంగ్‍లో హైలైట్‍గా ఉంది. విశ్వక్‍సేన్‍ను పాగల్ అంటే తాను ఒప్పుకోను అని ఆ కంటెస్టెంట్ డైలాగ్ చెప్పారు.
“వెల్‍కమ్ టు మోస్ట్ ఎంటర్‌టైనింగ్ ఫ్యామిలీ షో ఎవర్” అంటూ ఈ పాటలో విశ్వక్ అన్నారు. “తెలుగులో స్వాగతం.. జరిగే ఈ సంబరం” అంటూ ఈ ధమాకా సాంగ్ మొదలైంది. ఈ గేమ్ షో గురించి వివరిస్తూ పాట సాగింది. విశ్వక్ సినిమాలు ఓరిదేవుడా, దాస్ కా దమ్కీకి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన లియోన్ జేమ్స్ ఈ ధమాకా పాటకు కూడా సంగీతం అందించారు. ఉదయ్ కావూరి కంపోజ్ చేసిన డ్యాన్స్ స్టెప్స్ ఫుల్ జోష్‍తో ఉన్నాయి. ఈ పాటను దీపక్ బ్లూ ఆలపించారు. గేమ్ షోను వివరిస్తూ పూర్ణాచారి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.
‘ఫ్యామిలీ ధమాకా’ గేమ్ షో ఎప్పుడు మొదలు కానుందో ఆహా తేదీని వెల్లడించలేదు. త్వరలో రానుందని పేర్కొంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ప్రతీ ఎపిసోడ్‍లో రెండు కుటుంబాల మధ్య జరిగే గేమ్ షోలా ‘ఫ్యామిలీ ధమాకా’ ఉంటుందని తెలుస్తోంది.