విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన మూడో విడత వారాహి విజయ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖ చేరుకున్నప్పటి నుంచి పోలీస్ ఆంక్షలు అమలవుతూనే ఉన్నాయి. విశాఖ ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికే విషయం దగ్గర నుంచి సభల విషయంలోనూ పోలీసులు ఆంక్షలు విధిస్తూనే ఉన్నారని జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు శుక్రవారం రుషికొండ, ఎర్రమట్టిదిబ్బలను క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు పవన్ కల్యాణ్ బయలుదేరగా అందుకు సైతం పోలీసులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గురువారం జరిగిన సభలో పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో ఆరోపించారు. బహిరంగ సభలో పవన్ కల్యాణ్ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. వారాహి విజయయాత్రలో ఇలా జరగకూడదని సూచించారు. ఈ మేరకు విశాఖపట్నం తూర్పు ఏసీపీ నోటీసులు అందజేశారు. నిన్నటి బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయన అలా వ్యవహరించి ఉండకూడదని, బహిరంగ సభల్లో బాధ్యతగా మాట్లాడాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. విద్వేష వ్యాఖ్యలు చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సభలో వాలంటీర్లు, ఆంధ్రా యూనివర్సిటీపై ఆరోపణలు చేసిన జనసేనానికి సెక్షన్ 30 కింద నోటీసులు జారీ అయ్యాయి.