వాతావరణంలో కాలుష్యం, పెరుగుతున్న రసాయనాలు, మందులు వేసి పండించిన పంటలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ రొటీన్ లైఫ్ లో అలవాటు పడటంతో శరీరం నిరోధక శక్తిని కోల్పోతుంది. తద్వారా వాతావరణంలో చిన్న మార్పులు వచ్చినా.. అనారోగ్యానికి గురై ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీంతో నిత్యం వందలాది రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సర్కార్ దవాఖానాల్లో వార్డులు రోగులతో నిండిపోతున్నాయి. కొన్ని రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి ఆ తర్వాత వానలు లేకుండా పోయాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల తీవ్రత పెరిగింది.
సీజనల్ వ్యాధులు ప్రబలి పిల్లలకు వాంతులు, విరేచనాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగుజాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వర పీడితులతో కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రి కిటకిటలాడుతోంది. దవాఖానాలో 500 పడకలు పూర్తిగా బాధితులతో నిండిపోయాయి. రోగుల రద్దీతో జ్వరం తగ్గకముందే కొందరిని డిశ్చార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరల్ జ్వరాలు వందల సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. కరీంనగర్ పరిధిలోని కొత్తపల్లి, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, ఇల్లందకుంట, మానకొండూర్, హుజూరాబాద్, శంకరపట్నం మండలాల్లో డెంగీ జ్వరాలు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎవరిని పలకరించినా ప్లేట్‌లెట్లు తగ్గాయని చెబుతున్నారు.
వాతావరణంలో మార్పులకు తోడు పారిశుద్ధ్యం విషయంలో తగుజాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల జ్వరాలు పెరగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రికి వచ్చే అవుట్ పేషంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు 40మంది వస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 150కు పెరిగింది. వాంతులు, విరేచనాల కేసులు పెరిగాయి. పడకలు సరిపోకపోతే అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఎంతమంది వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆసుపత్రి సూపరింటెండ్ చెబుతున్నారు. డెంగీ నిర్ధారణ అయిన ప్రాంతాలను గుర్తించి వ్యాప్తి చెందకుండా దోమల నివారణ చర్యలు, రక్త నమునాల సేకరణ వంటివి చేపట్టాల్సిన అవసరం ఉంది.