భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు ఆయువు పట్టు. రాజుల కాలం నుంచి నేటి వరకు దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు.. వీటికి గుర్తులుగా పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి పన్నెండేళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం కోణార్క్ దేవాలయం. ఈ కోవెల విశేషాలు మీకోసం..
ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్ సూర్య దేవాలయం అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. కోన అంటే మూల అని, ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం. ఇది చంద్రభాగ నది ఒడ్డున నిర్మితమైంది.
13వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన నర్సింహదేవ నిర్మించారు. ఈ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని, వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్నా అద్భుత శిల్ప సౌందర్యంతో ఆకట్టుకుంటోంది.
ఈ ఆలయం సూర్యుని రథంలా ఉండే ఈ ఆలయానికి ఉన్న 24 చక్రాలు ఏదో అందానికి చెక్కారనుకుంటే పొరపాటే.. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చక్రాలు సమయాన్ని సూచిస్తాయి. ఈ ఆలయంలో ఉన్న చక్రాలపై పడే సూర్యకిరణాలు ఆధారంగా అక్కడి స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని లెక్కిస్తారు. అంతే రథాన్ని లాగుతున్నట్టు రూపొందించిన ఏడు గుర్రాలు ఏడు రోజులకు ప్రతీక అంటారు.
శిల్పకళా అద్భుతం అయిన ఈ ఆలయం, ఏడు గుర్రాలు లాగిన సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. ఈ ఆలయం 1884 సంవత్సరంలో ప్రపంచ వారసత్వ సంపద- యునెస్కో గుర్తింపు కూడా పొందింది.
15వ శతాబ్దంలో ఆక్రమణ దారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారు. పూజారులు సూర్య భగవానుడి విగ్రహాన్ని పూరి జగన్నాధ ఆలయంలో భద్రపరిచారు. ఫలితంగా ఈ ఆలయంలో ఇప్పటికీ దేవత విగ్రహం లేదు. కానీ ప్రతియేటా రథసప్తమి వేడుకలప్పుడు ఈ ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.
చిన్నారుల నుంచి యవ్వనంలో ఉండేవారికి, మలిసంధ్యలో ఉన్నవారికి ఇలా ఓ వ్యక్తి జీవితంలో వివిధ దశలకు సంబంధించిన విఙ్ఞానాన్ని అందిస్తోంది కోణార్క్ ఆలయం.
నేలకు రెండు అడుగుల ఎత్తులో అంటే పిల్లలకు కనిపించే విధంగా ఉండే వివిధ రకాల జంతువులు, పక్షులు వాటి విన్యాసాలు కనిపిస్తాయి. బొమ్మలతో పాటూ వాటి ఆహారపు అలవాట్లు కూడా దర్శనమివ్వడం పిల్లల్ని భలే ఆకట్టుకుంటాయి.
ఈ బొమ్మలకు పై భాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం, కుస్తీ లాంటి విభిన్న రకాల కళలున్న శిల్పాలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు చూపుతిప్పుకోనివ్వకుండా ఉంటాయి.
ఈ విగ్రహాలు అన్నింటిపైనా చెక్కిన కామసూత్ర భంగిమలు యవ్వనంలో ఉండేవారికి పాఠాలు నేర్పిస్తాయి. హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు తెలియజేస్తాయి.
ఈ దశ దాటిన తర్వాత పైకి దృష్టి మరల్చితే దేవతా మూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. ఎలాంటి ఆకర్షణలకూ, మోహానికి లొంగిపోకుండా మనసును నిర్మలంగా ఉంచుకోగలిగితే భగవంతుడు సాక్షాత్కరిస్తాడని చెప్పడమే వీటి పరమార్థం.