ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేయడంతో పాటు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ సాగేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి విజయ యాత్ర తొలిదశ గోదావరి జిల్లాల్లో పూర్తయిన విషయం తెలిసిందే. గోదావరి జిలాల్లో చేపట్టిన వారాహి యాత్ర అన్నవరంలో ప్రారంభమై భీమవరంలో పూర్తయింది. ఈ మధ్య కాలంలో కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర సాగింది. ఇందులో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్న పవన్.. పొత్తులపై మాత్రం అస్సలు మాట్లాడలేదు. ముఖ్యంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని, ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇవ్వాలని ఓటర్లను పవన్ కోరారు. ఇంకా చెప్పాలంటే ఈసారి తనకే ఓటు వేయాలని పవన్ వేడుకున్నారు.
ఇక మొదటి వారాహి యాత్ర విజయవంతంగా ముగియడంతో రెండో దశ వారాహి యాత్రకి జనసేనాని సిద్ధమైంది. దీనికి సంబంధించి రెండో దశ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు ఆ పార్టీ నేత పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ సాయత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రెండో దశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పవన్ సుదీర్ఘంగా చర్చించారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగసభతో యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.