కడుపునొప్పితో(stomach pain) ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడిలో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని(uterus) వైద్యులు గుర్తించారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి ఆపరేషన్ చేసి తొలగించారు డాక్టర్లు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తరి జిల్లాలో జరిగింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ధమ్‌తరికి చెందిన 27 ఏళ్ల యువకుడు కొద్దిరోజులుగా కడుపు నొప్పితో(stomach pain) బాధపడుతున్నాడు. దీంతో సెప్టెంబర్ 25న సమీపంలోని ఆస్పత్రిలో సంప్రదించగా.. పరీక్షలు చేసి ఆపరేషన్ చేయాలని సూచించారు వైద్యులు. వెంటనే శస్త్రచికిత్స మొదలుపెట్టిన వైద్యులకు ఊహించని షాక్ తగిలింది. యువకుడి కడుపులో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని గుర్తించిన డాక్టర్లు కంగుతిన్నారు. యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన వైద్యులు.. దాదాపు గంటన్నర పాటు ఆపరేషన్ చేసి కడుపులో నుంచి గర్భాశయాన్ని తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని.. మరికొన్ని రోజులు చికిత్స అందించాలని తెలిపారు.
ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తాయని.. ప్రపంచంలోనే ఇది 300 కేసు అని వైద్యులు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని తెలిపారు. సాధారణంగా ఇలాంటి కేసులు జన్మించే సమయంలోనే గుర్తిస్తామని.. ఆరేళ్ల వయసులోపే ఆపరేషన్ చేసి నయం చేస్తామన్నారు. కానీ గ్రామాల్లో మంత్రసానులు ప్రసవం చేస్తే వారు గుర్తించరని వివరించారు. ఈ ఆపరేషన్‌ను డాక్టర్ రోషన్ ఉపాధ్యాయ్ నేతృత్వంలో డాక్టర్ ప్రదీప్ దేవగణ్, డాక్టర్ రష్మీ ఉపాధ్యాయ్, డాక్టర్ మార్టిన్ ముకేశ్‌తో కూడిన వైద్యుల బృందం చేసింది.