తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న సాంకేతిక విద్యాసంస్థలు డేటా సైన్స్ అనుబంధ ప్రత్యేక కోర్సుల వైపు బాగా మొగ్గు చూపుతున్నాయి. ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలు, జేెఎన్‌టీయూ అనుబంధ విద్యాసంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ (ఏఐడీ), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇన్ డేటా సైన్స్ (సీఎస్‌డీ) లాంటి కోర్సులకు ఎంసెట్ ద్వారా అవకాశం కల్పిస్తున్నాయి. ఈ డేటా సైన్స్ ప్రత్యేకతలు, దీనిలో అభ్యసించే సాంకేతిక నైపుణ్యాలను తెలుసుకుందాం!
డేటా సైన్స్.. బిగ్ డేటా.. డేటా అనలిటిక్స్.. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన విభాగాలు! కారణం.. సమాచారానికి (డేటా) ఎనలేని ప్రాధాన్యం పెరగడమే. ఈ ఆధునిక యుగంలో సామాజిక మాధ్యమాల వినియోగం ఎక్కువ అవడం వల్ల డేటా భారీగా తయారవుతోంది. డిజిటల్ రూపంలో ఉన్న దీని విశ్లేషణ సరైన వ్యాపార నిర్ణయాలకు దోహదపడుతోంది.
గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ లాంటి అగ్రస్థాయి సంస్థలెన్నో డేటాను భద్రపరిచేందుకు కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. వినియోగదారులు ఎలాంటి వస్తువులు కొంటున్నారు.. వేటికోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు.. వారి ఆసక్తులు, అభిరుచులు.. ఇలాంటి సమాచారాన్ని సంస్థలు సేకరించి భద్రపరుస్తుంటాయి. అవసరమైనప్పుడు మళ్లీ ఈ డేటాను బయటకు తీసి.. సాంకేతిక పద్ధతుల ద్వారా విశ్లేషించి.. వినియోగదారుల అవసరాలు, అంచనాలకు తగ్గ వస్తు, సేవలను అందించేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వ్యాపార వృద్ధిలో, విస్తరణలో ముందుంటాయి.
విస్తృతమైన డేటాను విశ్లేషించి, ఉపయుక్తమైన నమూనాలను గుర్తించి, దాని ఆధారంగా కంపెనీలు కీలక వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడే పరిజ్ఞానమే డేటా సైన్స్. ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ రంగం. ఇందులో నిష్ణాతులవ్వాలంటే కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, అల్గారిథాల్లో మెరుగైన అవగాహనతో ఉండాలి. పెరుగుతున్న డేటా సైన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ టూల్స్ సహాయంతో ప్రతి సంస్థా 2030 నాటికి తమ సొంత డేటా ఆధారిత పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవచ్చని నిపుణుల అంచనా.