UPI Transaction: ఈ రోజుల్లో ఆన్‌లైన్ ట్రాన్జాక్షన్స్ పెరిగిపోయాయి. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ) ద్వారా సులభంగా చెల్లింపులు చేస్తున్నారు. షాపింగ్ చేసినప్పుడు, పెట్రోల్ పంప్‌లో ఆయిల్ కోసం, స్థానిక కిరాణా షాపులో చెల్లింపులు చేయడానికి ఇలా అన్నిచోట్ల యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఇది బాగానే ఉంది చెల్లింపులు కూడా సులువుగా జరుగుతున్నాయి కానీ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ఆన్‌లైన్ పేమెంట్స్ ఫెయిల్ అవుతాయి. వివిధ కారణాల వల్ల డబ్బులు వేరే ఖాతాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో అకౌంట్ నుంచి మనీ డెబిట్ అవుతుంది. అప్పుడు డెబిట్ అయిన డబ్బులను తిరిగి ఎలా పొందాలో ఈ రోజు తెలుసుకుందాం.
UPI పేమెంట్స్ ఫెయిల్ అవడానికి కారణాలు
ఒక్కోసారి ఇంటర్నెట్ స్లోగా ఉండటం వల్ల ఆన్‌లైన్ పేమెంట్స్ ఫెయిల్ అవుతాయి. మీ మొబైల్ ఫోన్ ఇంటర్నెట్‌కి సరిగ్గా కనెక్ట్ కాకపోతే లావాదేవీలు నిలిచిపోతాయి. బ్యాంకు సర్వర్లు పని చేయకపోయినా సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు సరికాని UPI పిన్ కూడా ఒక కారణం అవుతుంది. చాలా సార్లు అకౌంట్‌లో సరిపడ డబ్బులేకపోవడం కూడా ఒక కారణమవుతుంది. మీ రోజువారీ లిమిట్ అయిపోయినప్పుడు కూడా ఈ పరిస్థితి ఎదురవుతుంది.
UPI పేమెంట్స్ ఫెయిల్ అయితే ఏం చేయాలి..?
మీ యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంది. ఇలాంటి సమయంలో టెన్షన్ పడకూడదు. చాలా సార్లు డబ్బు చెల్లించిన 24 గంటల్లోపు అకౌంట్‌కు తిరిగి వస్తుంది. ఇది జరగకపోతే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి లేదా సంబంధిత శాఖను సంప్రదించి కంప్లెయింట్ చేయవచ్చు. దయచేసి UPI ఫిర్యాదులను NPCI వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని గుర్తుంచుకోండి.