మన హిందు ధర్మంలో సర్పాలను(పాములను) ఆరాధించే సంస్కృతి అనాది కాలం నుండి వస్తోంది. హిందూ ధర్మంలో సర్పాలను దేవతల ఆభరణంగా భావిస్తారు. మన దేశంలో ఎన్నో నాగ దేవతల ఆలయాలున్నాయి. అందులో ప్రముఖమైనది, ఇతర ఆలయాల కంటే భిన్నమైంది ఉజ్జయినిలోని నాగ చంద్రేశ్వరాలయం . ఉజ్జయినిలోని మహాకాల్ మందిరంలో మూడో అంతస్తులో నాగచంద్రేశ్వరాలయం కొలువై ఉంది. ఆ ఆలయం సంవత్సరంలో ఒక రోజు మాత్రమే, అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆరోజున మాత్రమే భక్తులకు నాగచంద్రేశ్వరస్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. మరి ఈ ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం…
నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో 11వ శతాబ్ధానికి చెందిన అద్భుతమైన ప్రతిమ ఉంటుంది. ఇందులో పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకుని కూర్చొన్న శివపార్వతులుంటారు. ఈ ప్రతిమను నేపాల నుండి తెప్పించారని చెబుతుంటారు. ఉజ్జయినిలో తప్ప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో మరెక్కడా ఉండదట. సాధారణంగా అయితే సర్పంపైన విష్ణు భగవానుడు మాత్రమే శయనిస్తాడు. కానీ ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉజ్జయిని లోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో భోళాశంకరుడు శయనించి ఉండటం విశేషం.
ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వారి ముద్దుల తనయుడు వినాయకుడు కూడా కొలువై ఉన్నఅద్భుత దృశ్యం చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో సర్పంపైన పరమశివుడు శయనించి ఉండడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే తెరిచే ఈ ఆలయంలో ఆ ఒక్క రోజున మాత్రమే సర్పరాజుగా భావించే తక్షకుడు ఆలయంలోనే ఉంటాడట. ఈ ఆలయంలో సర్పంపైన పరమశివుడు శయనించి ఎందుకు ఉన్నాడంటే సర్పరాజు తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్పు చేశాడట. ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడట. ఇక అప్పటి నుండి తక్షకుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడని చెబుతారు. పరమేశ్వరుడు తక్షకుడి పై కూర్చొన్న స్థితిలో కనిపిస్తాడు. అయితే నాగపంచమి రోజున అంటే శ్రవణ శుక్ల పంచమి రోజు నీ పై కొర్చోవడమే కాకుండ శయనిస్తానని చెబుతాడు. అందువల్లే ఈ దేవాలయంలో పరమేశ్వరుడు తక్షకుడి పై కూర్చొన్న స్థితిలో కనిపిస్తాడు.
నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 1050లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆయన తర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మహరాజ్ 1732లో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాడు. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సర్పదోషాలన్నీ తొలగిపోతాయట. ఈ దైవ దర్శనం వల్ల మన జీవితంలో అప్పటి వరకూ ఎదుర్కొన్న సర్పదోశ నివారణతో పాటు భవిష్యత్తులో కలిగే సర్ప సంబంధ దోషాలన్నీ సమిసిపోతాయని భక్తులు నమ్మకం. నాగపంచమి రోజు ఆలయానికి పోటెత్తుతుంటారు. నాగచంద్రేశ్వరుడి దర్శించుకుని పునీతులవుతారు. ఈ ఒక్కరోజే దాదాపు మూడు లక్షల మంది భక్తులు దర్శించుకోవడం విశేషం. ఇందులో విదేశీ భక్తులు కూడా ఉండటం విశేషం.