తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేని పేరు ఉదయ్ కిరణ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సంచలనాలు సృష్టించిన హీరో ఈయన. ఒకటి రెండు కాదు.. వరసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకని చాలా మంది స్టార్ హీరోల కంటే ఎక్కువ మార్కెట్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే ఒకానొక సమయంలో జరిగిన చిన్న సంఘటన కారణంగా ఆయన కెరీర్ పూర్తిగా తలకిందులు అయిపోయింది. అప్పటి నుంచి అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. ఇక చనిపోయే వరకు కూడా కోలుకోలేకపోయాడు. ఆర్ధిక ఇబ్బందులు, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా జనవరి 5, 2014న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఆయనకు సంబంధించిన విషయాలు అప్పడప్పుడు సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఆయన చెల్లెలు టాలీవుడ్‌లో స్టార్ సింగర్ అంటూ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరో కాదు సింగర్ పర్ణిక మాన్య.. ఆమె గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే బాహుబలి, భీమ్లా నాయక్ లాంటి ఎన్నో సినిమాలకు పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా పాటలు పాడింది. కెరియర్ ప్రారంభంలో ‘జీ తెలుగు సారేగమప’తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన సింగర్ పర్ణిక మాన్య.. ఆ తర్వాత తెలుగులో ప్లే బ్యాక్ సింగర్‌గా వరుస అవకాశాలు దక్కించుకుని మంచి గాయనిగా స్థిరపడింది. ‘అయిగిరి నందిని’ సింగిల్‌తో నెటిజన్లను పర్ణిక ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే పర్ణికకు ఉదయ్ కిరణ్ అన్నయ్య అవుతాడనేది నిజమే… తన పెద్దమ్మ కొడుకే ఉదయ్ కిరణ్ అని ఆమె గతంలో కూడా తెలిపింది. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉండేదని పర్ణిక పలుమార్లు కూడా చెప్పుకొచ్చింది. అన్నయ్య పేరును ఇండస్ట్రీలో తాను ఎప్పుడూ ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదని కూడా ఆమె చెప్పింది.
ఉదయ్ కిరణ్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి తమకు దూరం కావడం చాలా దురదృష్టకరం అంటూ గతంలో పలు ఇంటర్వ్యూలలో పర్ణిక చెప్పింది. ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. పర్ణిక మాన్య పేరుతో తన వ్యక్తగత వ్లాగ్స్ చేస్తుంటుంది కూడా… దేనికైనా రెడీ, బాడీగార్డ్, రభస, కవచం సినిమాల్లోని పాటలు కూడా ఆమెకు సింగర్‌గా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.