ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలంలో రెండేళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. కపిలేశ్వరపురానికి చెందిన అనూష దంపతుల కొడుకు ప్రిన్స్బాబు. రోజు మాదిరిగానే బుధవారం ఆడుకోవడానికి వెళ్లిన ప్రిన్స్.. కాసేపటికే అదృశ్యమయ్యాడు. బాలుడు కనిపించకపోవటంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా వెతికారు. తన బిడ్డకు ఏ ఆపద ముంచుకొచ్చిందో అనే అనుమానంతో ప్రిన్స్ తల్లి అనూష… కొడుకు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంటనే పోలీసులు స్పందించి దర్యాప్తు చేపట్టారు. సిబ్బందితో విస్తృత గాలింపు చేపట్టగా ఇంటి ముందు మురికి గుంతలో బాలుడి మృతదేహం లభ్యమైంది. కొడుకు మరణించటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అటూ గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. “బాలుడి తల్లి అనూష వచ్చి కొడుకు కనిపించటంలేదని ఫిర్యాదు చేసింది. వెంటనే మా సిబ్బందితో వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాం. ఇంటి ముందు మురికి గుంతలో మృతదేహాన్ని గుర్తించాం. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలుడు మురికి గుంతలో పడి ఉండొచ్చు. తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నాం.” అని పోలీసులు తెలిపారు.