ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు చిరుతలు మృతి చెందాయి. మడకశిర మండలం మెలవాయి గ్రామ సమీపంలో ఇవాళ మరో చిరుత మృతి చెందగా, నిన్న కూడా ఒక చిరుత మృతదేహాన్ని అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. వరుసగా చిరుత పులుల మృతదేహాలు బయటపడటంతో ఫారెస్ట్ అధికారులు ఉలిక్కిపడుతున్నారు. చిరుతల మృతదేహాలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి అటవీశాఖ అధికారుల బృందం రానుంది. కాగా, తిరుమలలో మరో చిరుత కలకలం రేపింది. తాజాగా ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో చిరుత బోనులో చిక్కింది. మూడు రోజులు క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమీపంలోనే చిరుత బోనులో చిక్కింది. ఇక ఆ చిరుతను బంధించడానికి మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలి మిట్ట, లక్ష్మినరశింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ తరుణంలోనే.. .లక్ష్మి నరశింహస్వామి ఆలయం వద్దే మరో చిరుత బోనులో చిక్కింది.
అంతకుముందు నాలుగు రోజుల క్రితం మెట్ల మార్గంలో కాలినడకన వెళుతున్న చిన్నారిని చిరుతలాక్కుపోయింది. నెల్లూరు జిల్లా పోతిరెడ్డి పాలెంకు చెందిన దినేష్ శశికళ దంపతులు శుక్రవారం తిరుపతి వచ్చారు. కాలి నడకన మెట్ల మార్గంలో తిరుమల వెళ్లేందుకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నడక ప్రారంభించారు. సాయంత్రం ఆరున్నర ఏడు గంటల సమయంలో 7వ మలుపు తర్వాత చిన్నారి లక్షిత కనిపించకుండా పోయింది. దీంతో స్థానికంగా బంధువులు వెదుకులాడినా ఫలితం లేకపోవడంతో పోలీసుల్ని రాత్రి పది గంటల సమయంలో ఆశ్రయించారు.
శనివారం ఉదయం మెట్ల మార్గానికి సమీపంలోని గుట్టపై చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ నాలుగు బోన్లను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయానికి అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. పూర్తి ఆరోగ్యంతో ఉన్న చిరుత ఆహారం కోసం మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి దొరికిపోయింది. చిన్నారి లక్షిత మృతదేహం కనిపించిన వెంటనే అటవీ శాఖ అప్రమత్తమైన పలు ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో లక్ష్మీనరసింహ ఆలయంలో ఏర్పాటు చేసిన బోనులోనే అది చిక్కింది.