తెలంగాణలో ప్రారంభమైనకొన్ని గురుకులాల్లో కొన్ని ప్రాంతాల్లో వసతుల లేమి వేధిస్తోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాయంపేట మహాత్మ జ్యోతిబాపూలే గురుకులంలో.. ములుగు జిల్లా మంగపేటకు చెందిన మహాత్మ జ్యోతిబాపూలే విద్యార్థులను ఇద్దరినీ ఒకే చోట విద్యాబోధన గురుకులం కొనసాగిస్తున్నారు. ఒకే చోట రెండు గురుకులాలు నిర్వహించడంతో వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మంగపేటలో సీటు వచ్చిన విద్యార్థులకు గురుకుల భవన సదుపాయాలు లేకపోవడంతో.. శాయంపేట మహాత్మ జ్యోతిబా పూలే గురుకులంలో విద్యా బోధన, వసతి కొనసాగిస్తున్నారు.
సర్కార్ బడుల డిజిటల్ బాట.. స్మార్ట్ తెరలపై పాఠాలు.. శ్రద్ధగా వింటున్న విద్యార్థులు.. అయితే అరకొర వసతుల మధ్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గది లేక.. తరగతి గదిలోనే నిద్రించాల్సిన దుస్థితి. బల్లలు లేక నేలపైనే కూర్చుని పాఠాలు వినాల్సిన వస్తోంది. రెండు గురుకులాలకు చెందిన 700 మందికి సౌకర్యాల కల్పన కష్టతరంగా మారింది.శాయంపేట గురుకులానికి సంబంధించిన విద్యార్థులకు సదుపాయాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, మంగపేట జ్యోతిబాపూలే గురుకులానికి చెందిన విద్యార్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే గదిలో రెండు క్లాసులు కొనసాగించడం వల్ల పాఠ్యాంశాలు అర్ధం కావడం లేదన్నారు.
విద్యా బోధన చేసే గదిలోనే డార్మెంటరీ, క్లాస్ రూమ్ నేలపై కూర్చోని వినాలని.. తరగతి పాఠాలు చెప్పడం అయిపోయాక అక్కడి గదులలోనే నిద్రించాలని ఇవన్నీ ఒకే చోట ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు వాపోయారు. వసతిగృహాల్లో అందరికీ సరిపడా మరుగుదొడ్లు, స్నానాల గదులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. మెస్‌లో భోజన చేయడానికి స్థలం సరిపోవడం లేదని పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా.. సరైన వసతులను కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదా తమకు కేటాయించిన మంగపేట గురుకులానికైనా తరలించలంటూ ప్రాధేయ పడుతున్నారు.
“మాకు శాయంపేట గురుకులంలో తగినన్ని తరగతి గదులు లేవు. ఒకటే గదిలో రెండు తరగతులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. మెస్‌లో భోజనం చేయడానికి తగినంత స్థలం లేదు. మాకు వసతులు కల్పించాలని కోరుతున్నాము. లేదా మమ్మల్ని మంగపేట గురుకులానికి పంపించాలి”. – విద్యార్థులు