ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రజల కోసం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని అన్నారు. ఈ విషయంపై ఘాటుగా స్పందిస్తూ.. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా వస్తానని పేర్కొన్నారు. మీతో శభాష్ అనిపించుకుంటానని.. అప్పటి వరకూ తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే తల నరుక్కుంటా కానీ.. తలవంచనని పునురుద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో తనను తప్పించానని కొందరు ఆనందపడొచ్చని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
తాను ఎవరినీ నిందించ తలచుకోలేదని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. తన రాజకీయ జీవితం ప్రజల చేతుల్లోనే ఉందని.. జిల్లా అభివృద్ధి కోసం జీవితం అంకితం చేశానని తెలిపారు. కొందరు పరాన్నభుక్కులు కొన్ని ఎత్తులు వేయవచ్చని అన్నారు. ఎందరో నాయకుల వల్లకానివి.. తాను చేసి చూపించినట్లు తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం నుంచి.. సుమారు 1000 కార్లు, 2000 బైక్‌లతో భారీ ర్యాలీగా ఖమ్మంకు చేరుకున్నారు. ఓపెన్ టాప్ కారులో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ ర్యాలీలో ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కనిపించలేదు. ర్యాలీలో కేవలం ఆయన ఫొటో ఉన్న ఫ్లెక్సీలు, జెండాలు మాత్రమే దర్శనమిచ్చాయి. మరోవైపు భారత్ రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికలకు 115 స్థానాలు ప్రకటించగా.. అందులో తుమ్మల నాగేశ్వరరావు పేరు లేకపోవడంతో.. ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఈ ఎన్నికల్లో నన్ను తప్పించానని కొందరు ఆనందపడొచ్చు. నేను ఎవరినీ నిందించదలచుకోలేదు. నా రాజకీయ జీవితం మీ చేతుల్లోనే ఉంది. జిల్లా అభివృద్ధి కోసం నా జీవితం అంకితం చేశాను. కొందరు పరాన్నభుక్కులు కొన్ని ఎత్తులు వేయవచ్చు. ఎందరో నాయకుల వల్లకానివి.. నేను చేసి చూపించా.” – తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి