కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత తిరుమల శ్రీవారి ఆదాయం గణనీయంగా పెరిగింది. కరోనా సమయం ఆటు ఆదాయం, ఇటు భక్తులు లేక వెలవెలబోయిన వడ్డీకాసులు వాడు ఇప్పుడు కాసుల మోతతో,భక్తుల రాకతో గలగలలాడుతున్నాడు.. గతంలో పోల్చితే స్వామివారికి హుండీ ద్వారా అధిక ఆదాయం లభిస్తోంది. తాజాగా జులై నెలలో తిరుమల శ్రీనివాసుడికి హుండీ ద్వారా రూ.129.08 కోట్ల ఆదాయం లభించింది. గత నెలలో వెంకన్నస్వామిని 23.23 లక్షల మంది దర్శించుకున్నారు. అదే సమయంలో 1.10 కోట్ల లడ్డూలను విక్రయించారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 56.68 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని, జులై నెలకు సంబంధించి తలనీలాల విక్రయం ద్వారా రూ.104 కోట్లు వచ్చిందనీ వివరించారు. అలాగే విశేష పూజలు, ఇతరత్ర వాటి ద్వారా మరో 32 కోట్ల రూపాయిలు స్వామి వారి సన్నిధికి చేరింది.
ఇక మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. స్వామివారిని నిన్న 69,365 మంది భక్తులు దర్శించుకోగా 26,006 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.05 కోట్లు వచ్చిందని వివరించారు. ప్రతి నెల నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఆగస్టు 4న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగే కార్యక్రమానికి భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకు భక్తులు 0877-2263261 అనే నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.