రాఖీ పండుగ(RAKSHABANDHAN) నాడు అన్నాతమ్ములకి అక్కచెల్లెలు రాఖీ కట్టి వారి దగ్గరనుంచి బహుమతులు అందుకుంటారు. అయితే తెలంగాణ ప్రజలు సైతం ఆర్టీసీకి రాఖీ పండుగ నాడు పెద్ద బహుమతిని అందచేసారు. దీంతో రాఖీ పండుగ టీఎస్‌ఆర్టీసీ(TSRTC)కి కలిసొచ్చింది అంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. దీనికి కారణం ఆర్టీసీ సంస్థకు గురువారం ఒక్కరోజే రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్‌టైం రికార్డు(ALL TIME RECORD). రాఖీపండుగ ఒక్క రోజు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ ఏడాది అదనంగా రూ.కోటి ఆర్జించింది. ఈ రాఖీపౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. మునపటి కన్నా లక్ష మంది ప్రయాణికులు అదనంగా ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించడం విశేషం. ఒక రోజులో ఇంత పెద్దఎత్తున బస్సు సర్వీసుల్లో ప్రయాణించడం ఇదే తొలిసారి. గత రాఖీ పండుగతో పోల్చితే 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఈసారి ఆర్టీసీ బస్సులు తిరిగాయి. 2022లో రాఖీపండగ రోజు 35.54 లక్షల కిలోమీటర్లు తిరగగా, ఈసారి 36.77 లక్షల కిలోమీటర్లు నడిచాయి.
రాష్ట్రంలోని 20 ఆర్టీసీ డిపోల్లో(RTC DEPO) 100 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నిరుటి రికార్డును తిరగరాసింది. 2022లో రాఖీ పండుగ రోజు 101.01 ఓఆర్ సాధించగా, ఈసారి 104.68 శాతం రికార్డు ఓఆర్ నమోదైంది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కట్‌పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 డిపోలు ఉండగా, 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించడం విశేషం. ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో అత్యధికంగా ఒక కిలోమీటర్‌కు రూ.65.94ను వరంగల్-1 డిపో, రూ.65.64ను భూపాలపల్లి డిపో సాధించింది. ఈ రెండు కూడా సంస్థ చరిత్రలోనూ ఎర్నింగ్స్ ఫర్ కిలోమీటర్ (ఈపీకే) ఆల్ టైం రికార్డు నమోదు చేయడం గమనార్హం.
ప్రజల ఆదరణ, ప్రభుత్వ ప్రోత్సాహన్ని స్ఫూర్తిగా తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో ఉద్యోగులు పనిచేసి ఈ రికార్డు సాధించారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ (MINISTER PUVVADA), ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి (CHAIRMAN BAJJIREDDY), ఎండీ సజ్జనార్ (MD SAJJANAR) కొనియాడారు. ఆర్టీసీ చరిత్రలో ఒక రోజులో రూ.22.65 కోట్ల రాబడి రాలేదని తెలిపారు. నిరుడు రాఖీపౌర్ణమిన 12 డిపోలు 100%పైగా ఓఆర్ సాధించగా, ఈసారి 20 డిపోలు నమోదు చేశాయని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు(LADY EMPLOYEES) పండుగను త్యాగం చేసి విధులు నిర్వర్తించారని, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.