రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణించే మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువగల బహుమతులు అందించనున్నట్లు తెలిపింది. ప్రతీ రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఈ నెల 30, 31 తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలంతా ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలని ఆర్టీసీ సూచించింది. ఆ డ్రాప్ బాక్స్ లను ఒక చోటికి చేర్చి.. ప్రతీ రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు.
“మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు వారు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు.. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ఈ నెల 30, 31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాలి.
ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుంది.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు.