ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళసై తీరుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా విజయవంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచే డిపోల ముందు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీల ధరించి నిరసన తెలిపారు. దీంతోబస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మికుల ధర్నాతో ఉదయం 6 నుంచి 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాగా, రాజ్‌భవన్ ముట్టడికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది.
ఉదయం 6.00 గంటలకు ప్రారంభమైన నిరసన కార్యక్రమం 8.00కి ముగిసింది. దీంతో, పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు యథాతథంగా ప్రారంభమయ్యాయి. కార్మికుల నిరసనతో ఉదయం వేళ ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్, చెంగిచెర్ల, హయత్‌నగర్, ఫలక్‌నుమా, ఫరూక్ నగర్, తదితర డిపోల్లో కార్మికులు తమ నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ తమ సమస్యలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
కాగా, రాజ్‌భవన్ వద్ద ఉదయం 11.00 గంటలకు మరోసారి నిరసన చేపట్టాలని టీఎంయూ నిర్ణయించింది. గ్రేటర్‌లోని కార్మికులు 10 గంటలకు నెక్లెస్ రోడ్డుకు రావాలని పిలుపునిచ్చింది. ఆర్టిసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బిల్లు రూపొందించిన ప్రభుత్వం ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇది ఆర్థిక బిల్లు కావడంతో అనుమతి కోసం రెండు రోజుల క్రితం గవర్నర్‌కు పంపించింది. బిల్లుకు ఇప్పటికీ అనుమతి లభించకపోవడంతో కార్మికులు, సిబ్బంది నిరసన కార్యక్రమానికి తెరతీశారు.