తెలంగాణలో గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు ఆగస్టు 21తో గడువు ముగియనుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే సవరించుకోవడానికి ఆగస్టు 16 నుంచి టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. వెబ్‌సైట్ ద్వారా ఎడిట్ చేసుకోవాలని, మెయిల్ లేదా నేరుగా వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోబోమని కమిషన్ తెలిపింది. సవరించిన అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మట్‌లో పొందుపరచాలని సూచించింది. అభ్యర్థులకు ఆగస్టు 21న సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అప్లికేషన్ ఎడిట్‌కు అవకాశం ఉందని, మరోసారి అవకాశం ఇవ్వబోమని కమిషన్ స్పష్టం చేసింది.
తెలంగాణలో గ్రూప్-3 సర్వీసు ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,363 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వగా.. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. తెలంగాణ తొలి గ్రూప్-3 పరీక్షకు మొత్తం 5,36,477 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఇందులో పేపర్-1(జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు, పేపర్-2(హిస్టరీ, పాలిటీ & సొసైటీ)-150 ప్రశ్నలు, పేపర్-3(ఎకానమీ & డెవలప్‌మెంట్)-150 ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ప్రశ్నపత్రం ఉంటుంది.