తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగులు మళ్ళీ ప్రిపరేషన్ ప్రారంభించారు. వేలాది సంఖ్యలో టీఎస్పీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇతర బోర్డులు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తరుణంలో నిరుద్యోగులు జాబ్ కొట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. దీంతో ఎన్నికల ముందు టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ వస్తుందని అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ ఇటీవల కెబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో అంతా షాక్ అయ్యారు.
గత సంవత్సరంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ని నిర్వహించిన తెలంగాణ సర్కారు అందులోనే పాసైన వారికి లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఇచ్చారు. అందులో లక్ష మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక అంతకు ముందే అర్హత సాధించిన వారితో కలుపుకుంటే కొన్ని లక్షల్లో నిరుద్యోగులు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతలోనే టీచర్ పోస్టుల భర్తీకి అడ్డంకులు ఉన్నాయని పేర్కొంటూ.. మరోసారి టెట్ ను నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఆగస్టు 16 వరకు అప్లై చేసే గడువు ఇచ్చారు. ఈ మేరకు సెప్టెంబర్ 15న టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అలాగే ఈ టెట్ పరీక్షా ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు. దీంతో మరో లక్ష మందికి పైగా అభ్యర్థులు టీఆర్టీ కోసం రెడీ కానున్నారు.
కొత్తగా టెట్ నిర్వహణతో ఈ ఏడాది ఉపాధ్యాయ భర్తీల నియామకం లేనట్టేనని తేలిపోయింది. మరో రెండు నెలల్లో ఎన్నికల కోడ్ కూడా రానుండటంతో ఇప్పట్లో టీఆర్టీ నోటిఫికేషన్ లేదని అభ్యర్థులు మరింత నైరాశ్యంలో మునిగిపోయారు. అలాగే వచ్చే ఏడాది సమ్మర్లో పార్లమెంట్ ఎన్నికల రానున్నాయి. దీంతో వచ్చే ఏడాది చివరి వరకు ఉపాధ్యాయ నియమాకాలు ఉండవని కూడా స్పష్టంగా తెలుస్తోంది.