‘తేనెలూరే భాష తెలుగు భాష’ అని పెద్దలు కొనియాడిన గొప్ప తెలుగు భాషను అందరికీ సులభంగా అర్థమయ్యేలా పాఠ్యపుస్తకాల్లో, పత్రికల్లో, ప్రసార సాధనాల్లో, సాహిత్యంలో ఉండేలా తన జీవిత కాలం పోరాటం చేశారు తెలుగు భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామ్మూర్తి. గ్రాంథికంలో ఉన్న తెలుగు భాషను సాధారణ భాషలో బోధించేలా ‘వ్యావహారిక భాషోద్యమాన్ని’ చేపట్టారు. ఈ క్రమంలో ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, భాషాభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ”ప్రథమ భారతీయ భాషా శాస్త్రవేత్త, తెలుగు వెలుగు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు. తెలుగు వ్యావహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువచేసిన గిడుగు రామ్మూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నాను. విద్యావ్యాప్తి జరగాలంటే బోధన జరిగే భాష మాతృభాషే అయివుండాలని ఆయన ఆశించారు. గిడుగు వారి ఆశయ స్ఫూర్తిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి.. పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తికి, సంరక్షణకు నడుం కట్టింది తెలుగుదేశం పార్టీనే. తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పాటుపడాలని కోరుతున్నాను” అని ఆయన అన్నారు.
గిడుగు తెలుగుకు-జాతికి వెలుగు తెలుగు.. తెలుగు వెలుగు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని ‘తెలుగు భాష దినోత్సవం’గా జరపడం తెలుగువారమంతా గర్వించదగ్గ పర్వదినమని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వ్యావహారిక తెలుగు భాషని సామాన్య జనం చెంతకి చేర్చిన మహానుభావుడు గిడుగు వెంకట రామ్మూర్తి అని కొనియాడారు. ఆయన అమ్మలాంటి తెలుగు భాషకు, జాతికి వెలుగని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
తెలుగు భాషను గౌరవించుకుందాం.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భారతీయ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి యావత్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ”పండితులకు మాత్రమే అర్ధమయ్యే గ్రాంథికంగా ఉన్న తెలుగు భాషను సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా ఉద్యమం చేసి, ప్రజలకు ఎంతో సేవ చేసిన గిడుగు వారి కృషి అద్వితీయం, చిరస్మరణీయం. మన మూలాలతో మన బంధాన్ని పటిష్ట పరిచే మన మాతృ భాష తెలుగును మనమందరం గౌరవించుకుందాం. దేశ భాషలందు తెలుగు లెస్స’ అని పురందేశ్వరి ట్వీట్ చేశారు.