తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. గతంలో భక్తులకు చిరుతలు, ఇతర జంతువులు కనిపించినా.. దాడి చేసినా.. ఓ ప్రాణం పోవడం మాత్రం ఇదే తొలిసారి కావడంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. ఈ ఘటనపై స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చాలా బాధాకరం అన్నారు. ఇక, తిరుమల నడకమార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై సీసీఎఫ్ నాగేశ్వరరావు అధ్వర్యంలో సీన్ రీకనస్ట్రక్సన్ చేయించాం.. చిరుతను బంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. గతంలో బోన్ లు ఏర్పాటు చేసి చిరుతను బంధించామని గుర్తుచేసిన ఆయన.. నడకదారిలో ఫారెస్ట్, పోలీసు, టీటీడీ కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.
తిరుమల ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల నిలిపివేత.. నడకదారుల్లో 2 గంటలకే భక్తులను అనుమతించే అంశాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ధర్మారెడ్డి.. నడకమార్గంలో ప్రతి 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. చిన్నపిల్లలతో వచ్చే తల్లితండ్రులు వారిని జాగ్రత్తగా పర్యవేక్షించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. మరోవైపు.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.. బాధిత కుటుంబానికి టీటీడీ నుంచి రూ. 5 లక్షలు, అటవీశాఖ నుంచి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తాం అన్నారు.. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని.. ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక అందిన తర్వాత చర్యలు చేపడతామని వెల్లడించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.