ఆంధ్ర ప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డ పంచాయతీ అనసభద్ర గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. బుధవారం స్వగ్రామం నుంచి ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామం అయిన నాగలిబెడ్డ, బొరిగి వైపు వ్యక్తిగత పనులపై స్కూటీపై వచ్చారు. పని పూర్తి చేసుకోని తిరుగు ప్రయాణంలో వస్తుండగా కేసలి సమీపంలో ఘాట్ రోడ్డులో ఉన్న ఓ మలుపు వచ్చింది. ఈ మలుపు వద్ద స్కూటీ అదుపు తప్పి.. 100 అడుగుల లోయలో పడిపోయారు.
దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో గ్రామ వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్న జన్ని బాలరాజు (21), మర్రి శివ (21) మర్రి జయరాజు (22) మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న ఒడిశాలోని నారాయణపట్నం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను నారాయణపట్నం తరలించి కేసు నమోదు చేశారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు చనిపోవడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుని తెలుసుకునికన్నీటి పర్యంతం అయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
గ్రామ వాలంటీరు బాలరాజు తల్లిదండ్రులు నారాయణ, రత్నాలు వ్యవసాయ కూలీలు. వారికి ఒక్కడే కుమారుడు. అన్నీ తానై చూసుకుంటాడని అనుకున్న తల్లిదండ్రులకుకన్నీటి వ్యధే మిగిలింది. ఇక.. జయరాజు తన తండ్రిని పదేళ్ల కిందట మృతి చెందారు. తల్లి తెరిజాతో కలసి జీవినం సాగిస్తున్నారు. ఉన్న ఒక్క కుమారుడిని చూస్తూ మురిసిపోయే ఆ తల్లికి విధి గర్భశోకం మిగిల్చింది. శివకు తల్లి మర్రి నల్లమ్మ, అన్నయ్య శంకరరావు ఉన్నారు. నాలుగు సంవత్సరాల కిందట తండ్రి అప్పన్న మృతి చెందారు. రెండు సంవత్సరాల కిందట కిందట అక్క భవానీ మృతి చెందింది. తల్లి నల్లమ్మ తన కుమారుడు శివతో కలసి జివిస్తోంది. బిడ్డపై ఎన్నో కలలు కన్న ఆ మాతృమూర్తికి పుత్రశోకం తప్పలేదు.