ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు జిల్లాలోని యర్రగొండపాలెంలో ఓ నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద లారీ, ద్వి చక్రవాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అంభాపురానికి చెందిన వినోద్, నాని, వీరేంద్రగా గుర్తించారు. వీరందరికి 20 సంవత్సారాలలోపు వయస్సు ఉంటుందని తెలుస్తోంది. స్థానికుల సహాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
పల్నాడు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి కూతురు ఇద్దరూ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పిడుగురాళ్ల మండలంలోని శ్రీనివాస నగర్ వద్ద అయ్యప్ప నగర్‌కు చెందిన యనమల నరసింహారావు (40), ఆయన కూతురు శ్రీనిధి (15)కి పుస్తకాల కోసం బ్రాహ్మణపల్లి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొనగా తండ్రి కూతురూ ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మేడి కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి లారీ గుంటూరు వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మేడి కొండూరు గ్రామానికి చెందిన గుండాల సామి ఏలు(24) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి కుటుంబీకులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
పల్నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో రైతు మృతి చెందారు. వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావు తెలిపిన వివరాల మేరకు నూజెండ్ల మండలం పాత నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గోగ నాగేశ్వరరావు (46), అదే గ్రామానికి చెందిన నాదెండ్ల మోహన్ రావు తో కలిసి ద్విచక్ర వాహనంపై వ్యవసాయ మోటారు మరమ్మత్తులు నిమిత్తం వినుకొండకు వస్తున్నారు. అదే సమయంలో ఎర్రగొండపాలెం వైపు వెళ్తున్న వినుకొండ ఆర్టీసీ ఢీకొట్టడంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాదెండ్ల మోహన్రావును 108 సహాయంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం నరసరావుపేటకు తరలించారు. రైతు నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పట్టణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.