టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) అరెస్టుపై దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) స్పందించారు. ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ మూలస్తంభాలని.. సిద్ధాంతాల పరంగా రాజకీయ పార్టీలకు వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలను ప్రజాస్వామ్యం అంగీకరించదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశంలో ఏపీలో ప్రతిపక్ష నేత అరెస్టుపై స్పందన అడగటంతో భట్టి విక్రమార్క( Bhatti Vikramarka) పై విధంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా కక్షసాధింపు చర్యలకు తావు ఉండొద్దన్నారు. ప్రధాని మోదీ.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు. దేశం నివ్వెరపోయేట్లు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు. ఆయన నివాసం ఉండే ఇంటి నుంచి బయటకు గెంటేశారని భట్టి వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) హౌస్ రిమాండ్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. జైల్లో చంద్రబాబుకు ముప్పు ఉందని, అందువల్ల ఆయన్ను హౌస్ రిమాండ్‌కు అనుమతించాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఇంటి కంటే జైలు వద్దే భద్రత ఎక్కువ అని భావిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌జీ ప్రొటెక్ట్ చేసే వ్యక్తిగా ఓ ఇంటి వద్ద ఆ స్థాయి భద్రత కల్పించలేమని పేర్కొంటూ హౌస్ రిమాండ్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. హౌస్ రిమాండ్ పిటిషన్‌పై పిటిషనర్ చేసిన వాదనలపై సంతృప్తి చెందలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.