వైవాహిక ఘట్టంలో తనకు తోడుంటానని అందరిముందు అగ్నిసాక్షిగా పెళ్లిచేసుకొని.. తీరా అక్రమ సంబంధాలు పెట్టుకొంటూ ఆడపిల్లల్ని, మహిళలను కొందరు మగవాళ్ళు అన్యాయం చేస్తున్నారు. కట్టుకున్న భర్తే ఇంకో ఆడదానితో అక్రమ సంబంధంలో ఉంటే… తట్టుకోలేని ఆ అబల దుఃఖంతో నిస్సహాయ స్థితిలో ఏం చేయాలోపాలుకోక ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా, అలాంటి ఘటనే ఏపీలోని అన్నమయ్య జిల్లా మధన పల్లిలో జరిగింది.
కట్టుకున్న భర్త తనను ఇంటి నుంచి గెంటివేసి, రెండోపెళ్లి చేసుకున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా
ఎలాంటి న్యాయం జరగకపోవడంతో నిస్సహాయ స్థితిలో, గుండెలు బద్దలయ్యే రోదనలో ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కురవంకకు చెందిన డేరంగుల రమేష్, బాబూకాలనీకి చెందిన శివజ్యోతికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. దీంతో శివజ్యోతిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రమేష్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. శివజ్యోతి తండ్రితో కలిసి బాబూకాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మొదటిభార్యకు తెలియకుండా చరితను రెండో వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. విషయం తెలుసుకున్న శివజ్యోతి శనివారం భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది.
భర్తపై తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా పోలీసులు ఫిర్యాదుపై స్పందించకపోవడం, భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శివజ్యోతి మనస్తాపం చెంది ఆదివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం ఆమె తేరుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.