ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కణుపూరు గ్రామంలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. కణువూరు గ్రామంలోని కల్యాణం సతీష్ వాలంటీరుగా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి తల్లోజు శశిధర్‌ని ఈ నెల 11న రోడ్డుపై వెళ్తుండగా ఆపి.. సిగరెట్లు తెచ్చి పెట్టమని కోరాడు. బాలుడు వినకుండా వెళ్లిపోయాడు.
దీన్ని మనసులో పెట్టుకున్న వాలంటీర్ సతీష్.. అదే రోజు రాత్రి బుర్రకథ కార్యక్రమం దగ్గర ఉన్న శశిధర్‌ను, అక్కడే ఉన్న మరో విద్యార్థిని సరదాగా తిరిగి వద్దామంటూ చెప్పి ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని సామిల్లు దగ్గర ఉన్న డాబాపైకి తీసుకువెళ్లాడు. అక్కడ అప్పటికే మద్యం సీసాలు, బజ్జీలు ఉన్నాయి. బజ్జీలు తినిమని వాళ్లుకు ఇచ్చాడు. ఆపై ‘సిగరెట్టు తెమ్మంటే ఎందుకు తీసుకురాలేదు? నేనవరో తెలుసా’ అంటూ శశిధర్‌ను చావబాదాడు. కొట్టద్దంటూ మరో బాలుడు ప్రాధేయపడగా.. ఇద్దర్ని కలిపి కొట్టాడు. ఇద్దరు తప్పించుకుంటూ కిందకి వెళ్లిపోతుండగా.. శశిధర్‌ను వెనుక నుంచి గట్టిగా తన్నడంతో డాబా పైనుంచి రోడ్డుపై పడ్డాడు. ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ వారిద్దరినీ బెదిరించాడు.
తరువాత శశిధర్‌ని తానే బైక్‌పై ఎక్కించుకుని ఇంటి వద్ద దింపాడు. గుడిమెట్లు ఎక్కుతుండగా కింద పడితే తీసుకువచ్చానని అతడి తల్లిని నమ్మించాడు. తీవ్రగాయాలైన బాలుడ్ని తల్లిదండ్రులు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అప్పటికీ గాయాలు నయం కాకపోవడంతో తరువాత ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. బాలుడు శశిధర్ గుడి మెట్ల మీద పడలేదని ఆ నోటా ఈ నోటా విన్న అతని తండ్రి వీరబాబు.. అనుమానంతో ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ తన కుమారుడి చెప్పు కనిపించడంతో శశిధర్‌ని ఆరాతీశాడు. ఘటన జరిగిన సమయంలో ఉన్న మరో బాలుడ్ని, శశిధర్‌ను గట్టిగా నిలదీయడంతో వాలంటీర్ సతీష్ చేసిన నిర్వాకం బయటికి వచ్చింది.