ఏపీలోని గన్నవరంలో రాజకీయాలు ముదిరాయి. తాజా రాజకీయ పరిస్థితులతో అప్రమత్తమైన వైసీపీ.. ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది.. వైసీపీ గుడ్‌బై చెప్పి యార్లగడ్డ వెంకట్రావ్.. తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయనతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు, క్యాడర్ కూడా సైకిల్ ఎక్కింది.. దీంతో.. దిద్దుబాటు చర్యలకు దిగింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. అందులో భాగంగా ఎంపీ బాలశౌరిని రంగంలోకి దించింది.. వైసీపీ అసంతృప్త నేత దుట్టా రామచంద్రరావుతో చర్చలు జరిపారు బాలశౌరి.. ఆయన కూడా టీడీపీలో చేరతారనే ప్రచారం ఓవైపు సాగుతుండగా.. ఆయన్ని బుజ్జగించి.. వైసీపీలో కొనసాగే దిశగా చూసేందుకు ఈ సమావేశం జరిగినట్టు ప్రచారం సాగుతోంది. ఇక, ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ బాలశౌరి.. వైసీపీ గన్నవరంలో మళ్లీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి దుట్టా సహాయ, సహకారాలు ఉంటాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఎంపీ బాలశౌరి.. వైసీపీ పుట్టినప్పడే దుట్టా పార్టీలో చేరారని గుర్తుచేసిన ఆయన.. కార్యకర్తలు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కోసం పనిచేశారు.. వైఎస్‌కి రాష్ట్రంలో ఉన్న అత్యంత సన్నిహితుల్లో దుట్టా రామచంద్రరావు ఒకరు అని తెలిపారు. దుట్టా పార్టీకి విధేయులు.. సీఎం వైఎస్ జగన్, పార్టీ కోసం ఆయన పని చేస్తారు.. అందులో నో డౌట్ అనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆయన చేయాల్సిన వరకు చేశారు. వేరే వాళ్లు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.. పార్టీకి ఏ అవసరం, జగన్ కి ఏ అవసరం ఉన్నా పార్టీ కోసం ఆయన పనిచేస్తారని తెలిపారు. ఇక, ఎంపీగా నాకు 10 వేల మెజార్టీ వచ్చింది.. పార్టీ మళ్లీ ఇక్కడ గెలిచేలా పనిచేస్తామని తెలిపారు ఎంపీ బాలశౌరి.