పిల్లల్లో నేరప్రవృత్తి పెరుగుతోంది. వస్తు వ్యామోహంతో ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకాడకపోవడం భయాందోళన రేకిత్తిస్తోంది. తమకు కావాల్సిన వాటిని దక్కించుకోవడానికి ఎంతటి ఘాతుకాలకైనా పాల్పడుతుండడం ప్రస్తుత సమాజంలో సర్వసాధారణమైపోయింది. తాజాగా ఇలాంటి దారుణ ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలో చోటుచేసుకుంది. 8వ తరగతి విద్యార్థిని తోటి పిల్లలే కిడ్నాప్ చేసి, హత్య చేసిన ఘటన బెంగాల్ లో కలకలం రేపింది. నదియా జిల్లా కృష్ణానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 25న చోటు చేసుకున్న ఈ దారుణంపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గేమింగ్ ల్యాప్‌టాప్ కొనాలని భావించిన నిందితులు తమ స్నేహితుడిని కిడ్నాప్ చేశారు. అతడి తల్లిదండ్రుల నుంచి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే కిడ్నాపర్లు అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో బాలుడిని గొంతునులిమి చంపేశారు. హత్యకు ముందు బాలుడి చివరి కోరిక అడిగి మరీ తీర్చారు. అతడికి ఇష్టమైన రసగుల్లా, సాఫ్ట్ డ్రింక్స్ ఇప్పించారు. మృతదేహాన్ని బ్యాగ్ లో పెట్టేసి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. తమ కుమారుడు కనిపించకపోవడంతో బాలుడు తల్లిదండ్రులు కృష్ణానగర్ పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం సైకిల్ పై స్నేహితులను కలిసేందుకు ఇంటి నుంచి వెళ్లిన తమ కొడుకు తిరిగి రాలేదని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని గుర్తించారు. లోతుగా విచారించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అదుపు చేశారు.