ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో దిగ్గజ పొలిటిషిన్ గా పేరుగాంచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన తదుపరి రాజకీయ అడుగులు కాంగ్రెస్ వైపేనన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 17న కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తుక్కుగూడ విజయభేరి సభలో సోనియా గాంధీ(Sonia Gandhi) సమక్షంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఆయనతో పాటు పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని హస్తం పార్టీ నేతలు వెల్లడించారు. బీఆర్ఎస్(BRS), బీజేపీకి చెందిన దాదాపు 15 మంది.. కాంగ్రెస్‌లో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy), జిట్టా బాలకృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లాల ఓదెలు తదితరులతో పాటు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జడ్పీ ఛైర్మన్లు తదితరులు పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు వివరించాయి.
పార్టీలో చేరేవారిలో టికెట్ డిమాండ్ లేకుండా ఉంటే వెంటనే పీసీసీ స్పష్టత ఇస్తోంది. టికెట్ కోసం వస్తున్నట్లు అయితే.. ఆ విషయంలో ఏఐసీసీ నుంచి స్పష్టత వచ్చాకే గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న తుమ్మలతో.. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(TPCC President Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పొంగులేటి తదితరులు.. తుమ్మలతో సమావేశమై కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
ఖమ్మం జిల్లాలో రాజకీయ దిగ్గజంగా ఉన్న తుమ్మల.. కాంగ్రెస్‌లో చేరికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తుమ్మల.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) మళ్లీ పాలేరు నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో పాలేరులో గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. అయినప్పటికీ.. పాలేరు టికెట్ తనకే ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్ఠానాన్ని అభ్యర్థించారు.