ఇండియా (India) పేరు మార్పుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు (G20 Summit) సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది. అయితే, ఇలా అధికారిక కార్యక్రమాల ఆహ్వాన పత్రికల్లో ‘ఇండియా’కు బదులుగా ‘భారత్’ అని ప్రస్తావించడం ఇది మొదటి సారి కాదు.
ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్ ( BRICS) సదస్సుకు హాజరైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గ్రీస్‌ను కూడా సందర్శించారు. ఆగస్ట్ 22-25 మధ్య ఆయన రెండు దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్‌లో కూడా ఆయనను ‘ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ (The Prime Minister Of Bharat) అనే పేర్కొన్నారు.
కాగా, ఇండోనేషియా(INDONESIA)లో నేటి నుంచి జరగనున్న ఆసియాన్ సదస్సు ఆహ్వాన పత్రికలో కూడా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ (Prime Minister Of Bharat) అనే ప్రస్తావించారు. ప్రధాని మోదీ నేడు ఇండోనేషియా పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. అక్కడ జరిగే 20వ ఆసియన్-ఇండియా సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. దీనితో పాటు 18వ ఈస్ట్ ఏషియా సదస్సులోనూ ఆయన పాల్గొననున్నారు. ఆ వేడుకల కోసం రూపొందించిన ఆహ్వాన పత్రికలో ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’(Prime Minister Of Bharat)గా రాశారు. దేశం పేరును మార్చాలని కేంద్ర సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో.. ఆసియాన్ ఇన్విటేషన్ లేఖలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌గా పేర్కొనడం మరోసారి చర్చనీయాంశమైంది.
కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఇండియా పేరును మార్చే ప్రతిపాదనను సభ్యుల ముందుంచనుందని తెలుస్తోంది. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్ (Bharat)గా మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతోందని.. ఇండియా పేరు మార్చుతూ సభలో తాజా తీర్మానం ఆమోదించేందుకు మోదీ సర్కార్ పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్ నుంచి జీ20 ప్రతినిధులకు అధికారిక సమాచారంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిఉండటం పేరు మార్పు ప్రతిపాదనకు బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ లేఖను ట్వీట్(Tweet) చేస్తూ ఈ వార్త నిజం కావచ్చని రాసుకొచ్చారు. దీంతో ఈ అంశం కాస్తా తీవ్ర చర్చనీయాంశమైంది.