తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మహంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తూ బీఅర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తోంది. నిశితంగా పరిశీలించిన తర్వాత గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయించారు. రేపు ప్రకటన విడుదల చేస్తారని పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మొదటి జాబితాలో 87 మంది పేర్లు ఉండొచ్చునని తొలుత భావించినా.. అవసరమైతే ఒకేసారి 100కు పైగా వెల్లడించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన కేసీఆర్.. ఈసారి అదే సెంటిమెంట్‌ను అనుసరించవచ్చునని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వామపక్షాలతో పొత్తు ఉండక పోవచ్చునని బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. తుది నిర్ణయం ప్రకటించకపోయినా.. సీపీఐ, సీపీఎంతో సీట్ల సర్దుబాటుపై పార్టీ నాయకత్వం కొంత విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని సీపీఐ, సీపీఎం కోరుతుండగా.. బీఆర్ఎస్ అధిష్ఠానం దానికి సిద్ధంగా లేనట్లు సమాచారం. ఖమ్మం నేతలు మాత్రం కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగించడం మేలనే అభిప్రాయాన్ని కేసీఆర్‌కు చెప్పారు. ఓవైపు అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం చేస్తున్న కేసీఆర్.. ఇప్పటి వరకు వామపక్ష నేతలతో నేరుగా ఎలాంటి చర్చలు జరపలేదు. ఈ పొత్తుపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సిట్టింగ్ స్థానాల్లో పది వరకు మార్చవచ్చని తెలుస్తోంది. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వేములవాడ, ఉప్పల్, వైరా తదితర స్థానాలపై ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆశిస్తున్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డివైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోందన్న ప్రచారం నియోజకవర్గంలో రాజకీయ రగడకు ఆజ్యం పోసింది. పల్లాకు టికెట్ ఇవ్వొద్దంటూ ఆర్టీసీ చౌరస్తాలో ముత్తిరెడ్డి వర్గీయులు నిన్న రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. జనగామలో పోటీ చేసేందుకు పల్లా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ముత్తిరెడ్డి నిన్న కంటతడి పెట్టారు.
అటు స్టేషన్ ఘన్‌పూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజయ్యకు టికెట్ ఇవ్వొద్దంటూ.. కడియం చేసిన వ్యాఖ్యలతో ఘన్‌పూర్ నిన్న భగ్గుమంది. వివిధ మండలాల్లో రాజయ్య అనుచరులు కడియంకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. వరంగల్-హైదరాబాద్ రహదారిపై రాజయ్య వర్గీయులు రాస్తారోకో చేశారు.భద్రాద్రి జిల్లా ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియపై అసంతృప్తులు తిరుగుబావుటా ఎగురవేశారు. హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటచూ.. ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ నివాసంలో పలు మండలాలకు చెందిన నాయకులు సమావేశమయ్యారు.
ఎమ్మెల్యే భర్త షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ప్రతి అభివృద్ధి పనిలో కమీషన్లు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా టికెట్ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు ఇస్తారన్న ప్రచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో మకాం వేసిన మదన్‌లాల్.. సీఎం అపాయిట్‌మెంట్ కోరినా లభించకపోవటంతో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను కలిసినా హామీ లభించలేదని తెలిసింది.