ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఇటీవల మహిళ దారుణ హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో.. మరో పని మనిషే దారుణంగా చంపేసిందని నిర్ధారించి ఆమెను అరెస్టు చేశారు. ఆ వివరాలను శ్రీకాకుళం రూరల్ ఎస్సై విజయ్‌కుమార్ శుక్రవారం వెల్లడించారు. శ్రీకాకుళం నగరం పెద్దపాడు రోడ్డులోని ఓ విశ్రాంత వైద్యుడి ఇంట్లో 15 ఏళ్ల నుంచి రాజు అనే మహిళ పని చేస్తోంది. అదే ఇంట్లో సుమారు 10 ఏళ్ల నుంచి మరో పని మనిషి చిట్టెమ్మ కూడా ఉంటోంది. యజమాని విశాఖపట్నంలోని కుమారుడి వద్ద ఉండటంతో ఇంటిని పని మనుషులిద్దరికీ అప్పగించారు. ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవారు. ఈ క్రమంలో చిట్టెమ్మ వివాహేతర సంబంధం విషయం రాజుకు తెలిసింది.
ఈ విషయమై ఆగస్టు 14న రాత్రి ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. రాజు ఎంతో కాలం నుంచి పని చేస్తుండటం, వివాహేతర సంబంధం గురించి రాజు చెబితే యాజమాని నమ్ముతారని ఆమెను అంతమొందించాలని చిట్టెమ్మ భావించింది. ప్రణాళిక ప్రకారం వంట గదిలోని చెక్కపీటతో తలపై బలంగా కొట్టి హతమార్చింది. ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలను పరిశీలించిన తరువాత చిట్టెమ్మపై అనుమానం రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేశామని, కొత్తరోడ్డు కూడలి వద్ద నరసన్నపేట వైపు వెళ్తుండగా పట్టుకుని విచారించగా ఆమె నిజం అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.