రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గ్రామంలోని వేరే వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని తీవ్ర ఆరోపణలు చేసిన భర్త కోపంతో తన భార్యను వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో బాధితురాలి అత్తమామలు కూడా ఈ దురాగతానికి సహకరించడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం వల్ల విషయం బయటపడింది.
డీజీపీ ఉమేశ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ధరియావద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. సోషల్‌మీడియాలో వీడియో వైరల్ కావడం వల్ల శుక్రవారం సాయంత్రం పోలీసులకు విషయం తెలిసింది. వెంటనే జిల్లా ఎస్పీతోపాటు పోలీస్ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. గ్రామ సిబ్బందిని ఆరాతీసి అక్కడ జరిగిన విషయాన్నంత తెలుసుకున్నారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై డీజీపీ వివరాలు వెల్లడిస్తూ.. బాధితురాలికి ఏడాది కిత్రం వివాహమైందని.. ఆమె గ్రామంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె అత్తమామలు, భర్త గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారని తెలిపారు. గురువారం.. ఆమెను కిడ్నాప్ చేసి తమ గ్రామానికి తీసుకెళ్లి అత్తమామలు, భర్తే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. బాధితురాలిని ఆమె భర్త గ్రామంలో కిలోమీటర్పాటు నగ్నంగా ఊరేగించాడని చెప్పారు. అయితే ఈ దురాగతానికి బాధితురాలి భర్త తరఫున మరికొందరు బంధువులు కూడా సహకరించారని తెలిపారు.