కార్చిచ్చు బీభత్సంతో ఉత్తర కెనడా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్ నగరం వైపు అగ్నికీలల వేగంగా వ్యాపిస్తుండడం వల్ల ప్రజలంతా ఖాళీ చేయాలంటూ స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ కార్చిచ్చు పదుల కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ వారాంతంలో ఎల్లోనైఫ్ శివార్లకు సమీపిస్తుందని తెలిపింది. ఆ నగరంలో ఉండాలనుకుంటే మీతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే అంటూ అప్రమత్తం చేసింది. ప్రజలను తరలించేందుకు విమానాలను సిద్ధంగా ఉంచామని నగర మేయర్ రెబెక్కా ఆల్టీ తెలిపారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికీ అత్యంత క్లిష్ట సమయమని, వీలైనంత వరకు ఒకరికొకరు సాయం చేసుకోవాలని సూచించారు. వాహనంలో ఖాళీ ఉంటే ఇతరులను ఎక్కించుకోవాలని కోరారు.
మూడు వేల మంది జనాభా కలిగిన హే రివర్ పట్టణంలో కూడా తరలింపు ప్రక్రియ జరుగుతోంది. బలమైన గాలుల కారణంగా కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని ఓ అధికారి వెల్లడించారు. కెనడా వ్యాప్తంగా వెయ్యి 70 కార్చిచ్చులు క్రియాశీలకంగా ఉంటే నార్త్ వెస్ట్ టెర్రిటరీస్‌లోనే 230 ఉన్నాయని అగ్నిమాపక విభాగం పేర్కొంది. మంటలను అదుపు చేయడానికి 100 మంది సైనికులను పంపించినట్లు తెలిపింది. మంటల ధాటికి ఇప్పటి వరకు లక్షా 36 వేల చదరవు కిలోమీటర్ల భూమి కాలిపోయిందని పేర్కొంది. 1989లో సంభవించిన కార్చిచ్చు వల్ల 76 వేల చదరపు కిలోమీటర్ల భూమి దహించుకుపోగా ప్రస్తుతం దాని కంటే రెట్టింపు నేల కాలిబూడిదైందని వెల్లడించింది.
ఈ ఏడాది జూన్లో కెనడా వ్యాప్తంగా 400 చోట్ల అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ఆ దేశం సహా అమెరికా తూర్పు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. దట్టమైన పొగ కారణంగా ఈ రెండు దేశాల్లో కోట్లాది ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆకాశంలో దట్టమైన పొగ అలముకుని రోజువారీ జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లకే పరిమితం కావాలని, మాస్కులు ధరించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్ పట్టణంలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. ఇది ఏక్యూఐ 400కిపైగా నమోదయ్యింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.