ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లో ఏకంగా 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం(Election Commission) వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామ కృష్ణం రాజు(MP Raghurama Krishnam Raju) రాసిన లేఖ మేరకు ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్యపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధాకారి (President of State Elections)సమాధానం ఇచ్చారు. గుర్తు తెలియని డోర్ నెంబర్లు, జీరో నెంబర్లపైనా 2 లక్షల 51 వేల 767 మంది ఓటర్లు నమోదు అయి ఉన్నట్టు ఆ లేఖలో తేల్చారు. అదే విధంగా ఒకే డోర్ నెంబర్‌లో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు సంఖ్య లక్షా 57 వేల 939 గా ఉన్నట్లు ఎన్నికల సంఘం తేల్చింది.
అదే సమయంలో ఒకే డోర్ నెంబర్ ఉన్న ఇళ్లలో 24 లక్షల 61వేల 676 మంది ఓటర్లు ఉంటున్నట్టుగా తేలిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పేర్కొన్నారు. మొత్తంగా ఏపీలో 27 లక్షల 13 వేల పైచిలుకు ఓట్లకు సంబంధించిన తనిఖీ జరుగుతున్నట్టు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) పేర్కొన్నారు. ఓకే డోర్ నెంబర్, జీరో డోర్ నెంబర్ సహా ఒకే ఇంటి నెంబరు పై 10 మంది ఓటర్లు కలిగిన కేసుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టామని స్పష్టం చేశారు.
దొంగఓట్ల (Fake Votes) ఏరివేతకు చర్యలు చేపట్టామని లేఖలో ఈసీ తెలిపింది. బీఎల్ఓలు వెరిఫికేషన్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే నకిలీ, జీరో డోర్ నెంబర్కు సంబంధించిన ఓటర్ జాబితాల తనిఖీ ప్రక్రియలో ఇప్పటి వరకూ 61 వేల 374 ఓట్లను సరిచేశామని పేర్కొన్నారు. ఇంకా లక్షా 90 వేల 393 ఓట్లు సరిదిద్దాల్సినవి ఉన్నాయని తెలియజేశారు. అలాగే సింగిల్ డోర్ నెంబరు(Single door number)పై 10 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న లక్షా 57 వేల గృహాలకు గానూ 21 వేల 347 గృహాల తనిఖీ పూర్తి అయ్యిందని సీఈఓ స్పష్టం చేశారు. మిగతా లక్షా 36 వేల 592 ఇళ్లలో తనిఖీలు చేయాలని చెప్పింది.
ఆయా ఓటర్ల జాబితాను సరిచేస్తామని తెలిపారు. ఈ మేరకు వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు సీఈవో నుంచి వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అదే విధంగా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సైతం గత ఏడాది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించిన ఎన్నికల సంఘం.. అవకతవకలపై దృష్టి సారించింది. పలువురు అధికారులపై వేటు వేసింది.