ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుబూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని సీఎం పేర్కొన్నారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
కాగా, పాడేరు ఘాట్ రోడ్డులో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చెట్టు కొమ్మను తప్పించబోయి లోయలో పడింది. ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఘటన జరిగింది.
ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. అవసరమైతే విశాఖపట్నం, అనకాపల్లి నుంచి నిపుణులైన డాక్టర్లను తీసుకొచ్చి వైద్యం అందిస్తామని చెప్పారు. క్షతగాత్రులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పాడేరు ఘాట్ ప్రమాద బాధితులను సీఎం ఆదేశాల మేరకు పరామర్శించానన్నారు. ప్రమాదం పై విచారణకు ఆదేశించామని, డ్రైవర్‌పై కేసు నమోదు చేస్తామని అమర్నాథ్ చెప్పారు. పాడేరు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని, ప్రమాద కారణాలపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.