అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో.. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా.. తెలుగుదేశం శ్రేణులు పెద్దఎ్తతున పార్టీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. బ్యానర్లు చించివేస్తున్న వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే సమయంలో ఘర్షణ మొదలైంది. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాలతో వైసీపీ మూకలు రెచ్చిపోయారు. దాడులకు దిగారు. టీడీపీ కార్యకర్తలపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు.. చెదరగొడుతున్నా వాళ్లేదురుగానే వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. ఈ దాడిలో.. మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్రకు గాయాలయ్యాయి. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అంగళ్లు గ్రామానికి చెరుకున్నారు. వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్న పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. జెండాలను గాల్లో తిప్పుతూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు వైసీపీ శ్రేణులు యత్నించినట్టు టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడికి దిగింది. అంగళ్లు సెంటర్ వద్దకు ఇరువర్గాలు చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకుండా, చోద్యం చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. గాయపడిన కార్యకర్తలకు చికిత్స చేయించాలని సూచించారు. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడు.. ఈ రావణాసురుడికి ఎమ్మెల్యే ట్యాగ్ ఉందని ఎద్దేవా చేశారు. వీరందరూ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. నేను పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలన్నారు. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. డీఎస్పీ తన యూనిఫామ్ తీసేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా ధైర్యం ఉంటే రండి చూసుకుందాం అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. పోలీసుల అండతో వైకాపా నేతలు రాజకీయం చేస్తున్నారని అన్నారు.