వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంస్థాగతంగా బీజేపీ కీలక మార్పులు చేపట్టింది. ఈ క్రమంలో, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పార్టీ హైకమాండ్ ఓ కీలక పదవి అప్పగించింది. ఈటలను బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటివరకు పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఇటీవల ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, తాను బీజేపీకి ఎప్పటికీ విధేయుడిగానే ఉంటానని, ఓ కార్యకర్తగా కష్టపడి పనిచేస్తానని, ఎప్పటికీ మోదీనే నా నాయకుడు అని ఈటల స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన బీజేపీ అధినాయకత్వాన్ని మెప్పించిందని తాజా నియామకం ద్వారా స్పష్టమవుతోంది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని నియమించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తెలంగాణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. పురం దేశ్వరి 2014లో బీజేపీలో చేరారు. బీజేపీలో మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం బీజేపీకి ఒడిశా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పురందేశ్వరికి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఏపీ బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ చీఫ్ గా కిషన్ రెడ్డిని నియమించింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతంలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2010-14 మధ్య ఉమ్మడి ఏపీకి, 2014-16 మధ్య తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. 2016-18 మధ్య శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేసింది. ఝార్ఖండ్ బీజేపీ చీఫ్‌గా మాజీ సీఎం బాబూలాల్ మరాండీ, పంజాబ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సునీల్ జాఖర్‌ను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. త్వరలో మరికొన్ని రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులను ప్రకటించే అవకాశాలున్నాయి.