ప్రధాని నరేంద్ర మోదీ పగ పట్టినట్లు తెలంగాణపై కక్ష కట్టారని.. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కళాశాల(Telangana Medical College) కూడా ఇవ్వలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా సొంత నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్().. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు సెస్ కార్యాలయం నుంచి ప్రారంభించిన భారీ ర్యాలీని అంబేద్కర్ కూడలి వద్ద ముగించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలోనే టెట్ పరీక్షా కేంద్రం ఉండటంతో లంచ్ సమయంలోనే భారీ సభను ముగించారు.
ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ(Telangana) నంబర్ వన్‌గా ఉందని మంత్రి కేటీఆర్(Minister KTR) కొనియాడారు. గతంలో డిగ్రీ కళాశాలలు ఎక్కడ పెట్టాలని మల్లగుల్లాలు పడ్డామని.. కానీ నేడు సిరిసిల్లకు మెడికల్ కాలేజీ వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో తొలి కేజీ టు పీజీ విద్యాసంస్థ గంభీరావుపేట(Gambhiraopet)లోనే ఉందని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల కొరత ఉండేదని.. కానీ ఇప్పుడు వైద్య కళాశాల ఏర్పాటుతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చని అన్నారు. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలో వంద మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని.. ఇక వైద్యుల కొరత దాదాపు తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
65 ఏళ్లలో తెలంగాణలో ఏర్పాటు చేసింది కేవలం రెండే మెడికల్ కాలేజీలని.. కానీ తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో 21 మెడికల్ కళాశాలలు నిర్మించుకున్నామని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వకున్నా.. సొంత నిధులతో అభివృద్ధి చేసుకొని దేశానికే ఆదర్శంగా నిలిచామని హర్షించారు. తెలంగాణ అభివృద్ధి కొంతమందికి గిట్టడం లేదని మండిపడ్డారు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు, మద్యం పంపిణీ చేయనని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. తనను సిరిసిల్లలో.. వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహరావును భారీ మెజారిటీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సిరిసిల్ల ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు.